ఆస్తి పన్నుల వసూళ్లపై కర్నూలు కార్పొరేషన్ దృష్టి..
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆస్తి పన్నుల వసూళ్లపై నగరపాలక సంస్థ దృష్టి సారించింది. పన్నుదారులకు ఊరటనిస్తూ బకాయి పన్నులపై వడ్డీకి 50 శాతం రాయితీ ప్రకటించడంతో, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
‘ఆలోచించండి.. బాధ్యతాయుతమైన పౌరుల్లారా..!’ అనే సందేశంతో ఆదివారం నగరంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం చేపట్టారు. “మీ ఎంపిక – మీ భవిష్యత్తు” అంటూ నగర అభివృద్ధిలో భాగస్వామ్యమవుతారా? లేక సమాజంలో అగౌరవానికి గురవుతారా? అనే ఆలోచనాత్మక సందేశాలతో ప్రజలను చైతన్యపరుస్తున్నారు.
పన్నులు చెల్లించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, నగర అభివృద్ధి పనులకు ప్రజల సహకారం అత్యవసరమని కమిషనర్ పి. విశ్వనాథ్ పేర్కొన్నారు. గడువు ముగిసేలోపు బకాయిలను చెల్లించి రాయితీ ప్రయోజనం పొందాలని ఆయన పిలుపునిచ్చారు. నగర అభివృద్ధికి పన్నుల వసూళ్లు కీలకమని, ప్రతి పన్నుదారు బాధ్యతగా ముందుకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
