నగరాభివృద్ధికి ప్రత్యేక దృష్టి…

నగరాభివృద్ధికి ప్రత్యేక దృష్టి…

. జిల్లా కలెక్టర్ ఏ. సిరి.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు నగరాభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిణి డా. ఏ. సిరి తెలిపారు. శుక్రవారం వెంకటరమణ కాలనీలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆమె తన ఛాంబర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ పుష్పగుచ్చం అందించి కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ… నగర పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. కార్యాలయంలో కర్నూలు నగరపాలక సంస్థ పూర్తి మ్యాప్‌ను ఏర్పాటు చేసి, అభివృద్ధి పనులపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అధికారులకు సూచించారు. పన్ను వసూళ్లను వేగవంతం చేసి ఆదాయ వనరులను పెంచాలని ఆదేశించారు.

ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ పథకాల అమలు స్థితిని సమీక్షిస్తూ, పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. నగరాభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేసిన కలెక్టర్, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, మేనేజర్ ఎన్. చిన్నరాముడు, ఎస్‌ఈ రమణమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.