ప్రజా సౌకర్యమే నా ప్రాధాన్యత
ప్రజా సౌకర్యమే నా ప్రాధాన్యత
స్పెషల్ ఆఫీసర్ డా. జి. లక్ష్మీశా
కార్పొరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా డా. జి. లక్ష్మీశా శుక్రవారం ఉదయం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని స్పెషల్ ఆఫీసర్ చాంబర్లో శుక్రవారం దుర్గగుడి ఆలయ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీఎంసీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీఎంసీ స్పెషల్ ఆఫీసర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తనను స్పెషల్ ఆఫీసర్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నగరాన్ని సీఎం ఎప్పుడు గేట్ వే టు అమరావతిగా పేర్కొంటారని , అందుకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రజా సౌకర్యాలను విస్తరించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం, విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి, నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు మరియు వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. నగరాభివృద్ధికి సంబంధించి ప్రాధాన్యత ఉన్న అంశాలను గుర్తించి, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారులు మరియు ఇతర కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షణలో నగర స్థాయిని నిలుపుకోవడానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

తదుపరి, వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని వివిధ శాఖలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈవో శీనా నాయక్, అడిషనల్ కమిషనర్లు డా. డి. చంద్రశేఖర్, ఎ. రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డా. కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ (ఇన్చార్జ్) పి. సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ చక్రవర్తి, జోనల్ కమిషనర్ కె. ప్రభుదాస్, సూపరింటెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.విజయలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జె.శ్రీనివాస్,ఏ. శ్రీనివాసరెడ్డి, జి సామ్రాజ్యం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ గోపాల నాయక్, డాక్టర్ అన్నపూర్ణ, అసిస్టెంట్ కమిషనర్లు ఏ యు బి శర్మ, హెలెన్, డి ఎస్ ఎస్ శ్రీనివాస్ , బయాలజిస్ట్ కామేశ్వరరావు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, మేనేజర్ ప్రభావతి సిబ్బంది పాల్గొన్నారు.


