అకాల వర్షాలపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

అకాల వర్షాలపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
కలెక్టర్ కార్యాలయంలో 91549 70454 నంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలో వచ్చే మూడు రోజులపాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశించారు. వాతావరణ, విపత్తుల నిర్వహణ శాఖ సూచనల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
విజయవాడ నగరపాలక సంస్థ, మున్సిపల్, పంచాయతీ శాఖలు డ్రైనేజీ వ్యవస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడా నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని, పంటలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా మిర్చి రైతులను అప్రమత్తం చేయాలని కళ్లాల్లోని మిర్చిని జాగ్రత్తగా భద్రపరచుకునేలా చేయూత ఇవ్వాలని ఆదేశించారు.
రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్ అండ్ బీ తదితర శాఖలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రజలు వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని, చిన్నపిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా స్థానిక అధికారులను వెంటనే సంప్రదించాలని కోరారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో కూడా కమాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454 )అందుబాటులో ఉందని.. ఈ నెంబర్ కూడా ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు.
జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంటలకు జరిగిన నష్టంపై రైతులకు పరిహారం అందుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
