bcci | ప‌ద‌వీకాలం పొడిగించండి

bcci | ప‌ద‌వీకాలం పొడిగించండి

బీసీసీఐకి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్ విన్న‌పం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్ తన పదవీకాలాన్ని పొడిగించమని బీసీసీఐని కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ను భారత్ నిలబెట్టుకున్న నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌ 2027 వరకు తనకు అవకాశం కల్పించమని కోరిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై బోర్డులో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ కానీ, అజిత్‌ అగార్కర్‌ కానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఐపీఎల్‌ 2025కు ముందు ఓ సంవత్సరం పాటు అగార్కర్‌ పదవీకాలాన్ని పొడిగించిన విషయం తెలిసిందే.

2023 జూన్‌లో చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అగార్కర్ హయాంలో భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించింది. ఆయన ఎంపిక చేసిన జట్లు 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుని, మొత్తం మూడు ఐసీసీ ట్రోఫీలను భారత్‌కు అందించాయి. అంతేగాక 2023, 2025 ఆసియా కప్‌లను కూడా కైవసం చేసుకున్నాయి. ఈ కాలంలో ఆడిన 33 వైట్-బాల్ మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే ఓడిపోయి అసాధారణ రికార్డును నెలకొల్పింది.