రోడ్డు భద్రత మనందరి బాధ్యత..

రోడ్డు భద్రత మనందరి బాధ్యత..
రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉండాలి..
డీటీసీ యం పురేంద్ర
విజయవాడ, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అప్పుడే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని, రోడ్డు భద్రతను మనందరి బాధ్యతగా గుర్తెరిగి వాహనాలను నడపాలని డీటీసీ యం. పురేంద్ర అన్నారు. స్థానిక డీటీసీ కార్యాలయం నుండి బుధవారంనాడు ఒక ప్రకటనను డీటీసీ యం పురేంద్ర విడుదల చేసారు. డీటీసీ పురేంద్ర మాట్లాడుతూ ఈనెల13న జిల్లా కలెక్టరు డా,, జి లక్ష్మిశ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో జరిపిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశములో రహదారి భద్రత, ఎన్ఫోర్స్మెంట్, హిట్ అండ్ రన్ స్కీమ్ అమలు మొదలగు వాటిపై తీసుకున్న నిర్ణయాలను పూర్తిస్థాయిలో అమలుచేయాలని జిల్లాలోని రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
రోడ్డు ప్రమాదాల తగ్గించే దిశగా తీసుకుంటున్న నిర్ణయాలలో భాగంగా రహదారి భద్రతా నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చెయ్యడంతో పాటు వాహనాలను సీజ్ చేయడం కూడా జరుగుతుందన్నారు. జనవరి లో జరిపిన తనిఖీలలో ఓవర్ స్పీడ్, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, నో రిఫ్లెక్టర్స్, హెల్మెట్ ధరించికుండా వాహనం నడపడం, రవాణా వాహనాలలో అధిక లోడు కలిగిఉండటం, రవాణా వాహనాలలో ప్రయాణికులను తీసుకు వెళ్లడం, వాహనాల పరిమితి మించి ఎక్కువగా ప్రయాణికులను ఎక్కించడం వంటి పలు వాహనాలపై 3173 కేసులు నమోదు చేయడం జరిగిందని వివరించారు.
రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు ఎక్కువుగా గురవుతున్నారని, హెల్మెట్ ధరించకపోవడం వలన ప్రమాద సమయాలలో మృత్యువాత పడుతున్నారని ఆయన అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. రోడ్డు భద్రత పై ప్రజలలో మరెంత అవగాహన పెంచే విధంగా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా రవాణాశాఖ చేస్తున్న కృషిని జిల్లా కలెక్టర్ డా,, జి లక్ష్మిశ అభినందనలు తెలియజేసారని ఆయన జిల్లాలోని రవాణాశాఖ అధికారులకు తెలియజేశారు. అదే స్ఫూర్తితో జిల్లాలోని అధికారులు పనిచెయ్యలని డీటీసీ పురేంద్ర కోరారు.
