ప్రజారోగ్యమే ప్రాధాన్యం…

ఎంపీ చిన్ని మెగా హెల్త్ క్యాంప్‌కు విశేష స్పందన

ఆంధ్రప్రభ, విజయవాడ: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ ప్రారంభించిన హెల్తీ,వెల్తీ, హ్యాపీ విజయవాడ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో 400 మందికి పైగా ప్రజలు పాల్గొని వైద్య సేవలు పొందారు.

ప్రముఖ గుండె వ్యాధుల నిపుణుడు డా. ఆకాష్ పల్లెం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం, ఆయాసం, గుండెదడ, ఛాతినొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి నిపుణుల వైద్య సలహాలు అందించారు. శిబిరంలో భాగంగా ఉచితంగా ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులను కూడా పంపిణీ చేశారు.

గుండె సంబంధిత సమస్యలు గుర్తించిన వారికి రూ.13 వేల విలువైన యాంజియోగ్రామ్ పరీక్షలను డా. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా పూర్తిగా ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) మాట్లాడుతూ,ప్రజల ఆరోగ్య భద్రత మా ప్రధాన బాధ్యత. ఆరోగ్యవంతమైన సమాజమే అభివృద్ధికి పునాది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్నదే మా లక్ష్యం. అందుకే నిపుణుల వైద్య సేవలను ప్రజలకు చేరువ చేసే కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తాం” అని పేర్కొన్నారు.

వైద్య శిబిరానికి హాజరైన ప్రజలు ఆధునిక వైద్య పరీక్షలు, నిపుణుల సలహాలు ఉచితంగా అందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఆరోగ్య సమస్యలకు సరైన మార్గదర్శకత్వం లభించిందని తెలిపారు. ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని ఎంపీ కేశినేని చిన్ని చేపడుతున్న కార్యక్రమాలు విజయవాడలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.