రైతు పండించిన పంట 30% మాత్రమే కొనుగోలు……

రైతు పండించిన పంట 30% మాత్రమే కొనుగోలు……

మిగిలిన పంట బయట మార్కెట్ లో అమ్ముకోండి….
వ్యవసాయ అధికారి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సభ్యులు…….

వీరులపాడు, ఆంధ్రప్రభ : రైతు పండించే ప్రతి పంటను ప్రభుత్వం 30% మేర మాత్రమే కొనుగోలు చేస్తుందని మండల వ్యవసాయ అధికారి జోగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం వీరులపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జుజ్జురులోని జల్లి యేసేపు కళ్యాణ మండపంలో ఎంపీపీ కోటేరు లక్ష్మీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలు శాఖల సమీక్షలో భాగంగా వ్యవసాయ అధికారి జోగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రైతుల పండించే ప్రతి పంటను కొనుగోలు కేంద్రాల్లో 30% మేర మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన పంటను బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాలని వ్యవసాయ అధికారి అనడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకృతి విపత్తులను ఎదుర్కొని పంట పండించే రైతు ఎన్నో విధాలుగా నష్టపోతుంటే ప్రభుత్వ అధికారులు ఈ విధంగా మాట్లాడం సమంజసం కాదన్నారు. పాలకులు పట్టించుకున్న పట్టించుకోకున్నా రైతు మాత్రం వ్యవసాయం చేయక తప్పడాంలేదు. 30% ప్రభుత్వం కొనుగోలు చేస్తే మిగిలిన 70% పంటను రైతు ఏం చేయాలని వారు ప్రశ్నించారు. రైతుల పట్ల నిర్లక్ష్యపు సమాధానం చెప్పే అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని పలువురు డిమాండ్ చేశారు.

రైతుకు వ్యవసాయమే దిక్కు తప్ప మరో మార్గం లేదన్న విషయాన్ని పాలకులు, ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ఖరీఫ్ లో అధిక వర్షాలతో పంట నష్టపోతే ప్రభుత్వం ఆదుకో పోగా రబీలో పుల్ల సెనగ సాగుచేసిన రైతుల వద్ద నుండి పంటను పూర్తిస్థాయిలో ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు మండల వ్యవసాయ అధికారి 30 శాతం మేర మాత్రమే పంటను కొనుగోలు చేస్తామని బహిరంగంగా చెప్పడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం రైతు పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేయకుంటే భవిష్యత్తులో పంట సాగు చేసేందుకు రైతు ముందుకు వచ్చే పరిస్థితి లేదన్న విషయాన్ని పాలకులు గమనించాలన్నారు.

అధికారులు రైతులకు సహకరించి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు వ్యతిరేకిగా మాట్లాడిన వ్యవసాయ అధికారిపై చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు 300 రూపాయలు మేరా రుసుము వసూలు చేయటం ఏమిటని పలువురు సభ్యులు వాపోయారు. రైతు ఎక్కడ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారి జవాబు ఇచ్చారు. పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై ఎంపీడీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఏఈ రవికుమార్, వైస్ ఎంపీపీ లు షేక్ నాగుల్ మీరా, వేమూరి ఆదాము,ఎంపీడీవో రూపవతి, పంచాయతీ కార్యదర్శులు సునీల్ కుమార్, రాణి, నాగేశ్వరరావు,రాజశేఖర్, వేణుగోపాల్ రెడ్డి, రాణి, వెంకటేశ్వరరావు, డిసీ చైర్మన్ కాపా రాంబాబు, సొసైటీ అధ్యక్షులు చల్లా శ్రీనివాసరావు, తిరుమల శెట్టి సాంబశివరావు, షేక్ రహంతుల్లా తోపాటు పలు శాఖ ల అధికారులు పాల్గొన్నారు.