ఇరాన్ యుద్ధ ప్రభావం….

ఇరాన్ యుద్ధ ప్రభావం….

గల్ఫ్ దేశాలకు ఆగిన మామిడి గుజ్జు ఎగుమతులు
చిత్తూరు మామిడి రైతులకు మళ్లీ కష్టకాలం
దేశీయ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్న పరిశ్రమలు

చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లాలో ఉత్పత్తి అవుతున్న మామిడి పంటపై అంతర్జాతీయ పరిస్థితులు మరోసారి తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా మధ్యప్రాచ్య ప్రాంతానికి జరిగే మామిడి గుజ్జు ఎగుమతులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఇప్పటికే మామిడి సీజన్ ప్రారంభ దశలో ఉండగా ఈ పరిణామం జిల్లాలోని రైతులు, గుజ్జు పరిశ్రమల యజమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా పండే తోతాపురి రకం మామిడి పండుతో తయారయ్యే మామిడి గుజ్జుకు గల్ఫ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం మార్చి చివరి వారంలోనే మధ్యప్రాచ్య దేశాల నుంచి కొనుగోలు ఒప్పందాలు కుదురుతాయి.

అయితే ఈసారి ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో సముద్ర మార్గంలో నౌక రవాణాపై అనిశ్చితి నెలకొంది. ఫలితంగా దిగుమతిదారులు ఇప్పటికే కుదిరిన సరుకు పంపిణీ ఒప్పందాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పరిశ్రమల యజమానులకు సమాచారం అందింది. జిల్లాలో ప్రస్తుతం 47 మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. గత ఏడాది ఉత్పత్తి చేసిన గుజ్జు నిల్వలు ఇప్పుడిప్పుడే ఎగుమతులు కావాల్సిన సమయంలో యుద్ధ ప్రభావం కారణంగా అవి గోదాములకే పరిమితమయ్యాయి. ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడం, హార్ముజ్ జలసంధి ప్రాంతంలో నౌక రవాణా అంతరాయం ఏర్పడటం వల్ల సౌదీ అరేబియా, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలకు ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి.

ప్రస్తుతం లక్ష టన్నులకు పైగా మామిడి గుజ్జు నిల్వగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి పరిశ్రమలకే కాకుండా మామిడి రైతులపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. జిల్లాలో సుమారు 87,500 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 88 వేల మెట్రిక్ టన్నుల వరకు మామిడి ఉత్పత్తి అవుతుంది. ఈ పండ్లలో ఎక్కువ భాగం గుజ్జు పరిశ్రమలకు సరఫరా అవుతుంది. జిల్లాలోని పరిశ్రమలు సంవత్సరానికి సుమారు 7 లక్షల టన్నుల మామిడి కాయలను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వాటి నుంచి దాదాపు 3.50 లక్షల టన్నుల మామిడి గుజ్జు ఉత్పత్తి అవుతుంది..సాధారణంగా చిత్తూరు జిల్లాలోని పరిశ్రమల నుంచి మామిడి గుజ్జును పెద్ద కంటైనర్లలో నింపి చెన్నై నౌకాశ్రయానికి తరలిస్తారు.

అక్కడి నుంచి నౌకల ద్వారా ఎర్ర సముద్రం మార్గంగా గల్ఫ్ దేశాలకు సరుకు పంపిణీ చేస్తారు. అయితే ప్రస్తుతం ఆ మార్గంలో రవాణా సమస్యలు తలెత్తడంతో నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో రవాణా వ్యయం కూడా భారీగా పెరిగింది. ఇంతకు ముందు ఒక కంటైనర్‌ను ఎర్ర సముద్రం మార్గంగా తరలించేందుకు సుమారు వెయ్యి డాలర్లు ఖర్చవుతుండేది. ఇప్పుడు శ్రీలంక చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో అదే రవాణా ఖర్చు ఐదు నుంచి ఆరు వేల డాలర్లకు పెరిగింది. అంటే సుమారు ఐదు నుంచి ఆరు రెట్లు అధిక వ్యయం అవుతోంది. ఈ అదనపు భారాన్ని పరిశ్రమల యజమానులు భరించడం కష్టమైపోతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది కూడా అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా చిత్తూరు మామిడి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో యూరోపియన్ మార్కెట్లలో దిగుమతి సుంకాలు పెరగడంతో ఎగుమతులు తగ్గిపోయాయి.

ఆ సమయంలో కూడా పరిశ్రమలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. అంతకుముందు కరోనా మహమ్మారి సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మామిడి గుజ్జు నిల్వలు పేరుకుపోవడంతో పరిశ్రమలు రైతుల నుంచి పండ్లు కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ఫలితంగా మామిడి ధర కిలోకు నాలుగు నుంచి ఐదు రూపాయలకే పడిపోయింది. రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. ఈ ఏడాది పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించిన రైతులకు ఇప్పుడు ఇరాన్ యుద్ధం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఎగుమతులు నిలిచిపోతే పరిశ్రమలు మామిడి కొనుగోలు తగ్గించే అవకాశం ఉందని రైతు సంఘాలు భావిస్తున్నాయి. దీంతో మామిడి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమల యజమానులు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రవాణా వ్యయం భారీగా పెరగడం, విదేశీ కొనుగోలుదారులు ఒప్పందాలు రద్దు చేయడం వంటి కారణాల వల్ల ఎగుమతులు కొనసాగించడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్ వైపు దృష్టి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మామిడి రైతులకు, గుజ్జు పరిశ్రమలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఎగుమతులు నిలిచిపోతే రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం, పరిశ్రమలకు రుణాలపై ఉపశమనం ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు స్థానిక వ్యవసాయ రంగంపై ఎంతటి ప్రభావం చూపుతాయో చిత్తూరు మామిడి రైతుల పరిస్థితి మరోసారి స్పష్టంగా చూపుతోంది. ఈ సీజన్‌లో ఎగుమతులు తిరిగి ప్రారంభం కాకపోతే జిల్లాలోని వేలాది మంది రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply