ఎన్టీఆర్ సేవలు తెలుగు జాతికి చిరస్మరణీయం

ఎన్టీఆర్ సేవలు తెలుగు జాతికి చిరస్మరణీయం
జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు తెలుగు జాతికి అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గురువారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, 1923 మే 28న కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు ఎన్టీఆర్ జన్మించారని తెలిపారు. పట్టుదల, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఆయన తెలుగుజాతికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు.
సినీ రంగంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ తన 44 ఏళ్ల సినీ జీవితంలో 13 చారిత్రక, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాల్లో నటించి అపారమైన ప్రజాదరణ పొందారని పేర్కొన్నారు. ఆయన క్రమశిక్షణ, పట్టుదల భావితరాలకు స్ఫూర్తిదాయకమని, యువత ఆయన నైతిక విలువలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ అసాధారణ నాయకత్వాన్ని ప్రదర్శించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చెరగని ముద్ర వేశారని తెలిపారు. పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మహానేతగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్ ఎస్పీ రాజశేఖర్ రాజు, ఏఆర్ అదనపు ఎస్పీ దేవదాస్, ఆర్ఐ వెల్ఫేర్ చంద్రశేఖర్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
