మహిళా సాధికారతకు రైల్వే శాఖ పెద్ద పిట..

మహిళా సాధికారతకు రైల్వే శాఖ పెద్ద పిట..

విజయవాడ రైల్వే డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం..
ఆరోగ్య శిబిరాలు, అట పోటీలతో ఉత్సాహభరిత వేడుకలు

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ ; మహిళల సాధికారత, సమానత్వం సందేశాన్ని విస్తృతంగా చాటిచెప్పేలా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగినులు, వారి కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో విజయవాడ రైల్వే సభాభవనంలో జరిగిన ఈ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి.దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.

విజయవాడ రైల్వే సభాభవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనియాకీయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు వర్ష సోనియాకీయ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

సంప్రదాయ దీపప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీనియర్ డివిజనల్ పర్సనల్ అధికారి ప్రేమ్ కుమార్ లక్షవాట్ అతిథులను స్వాగతించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రసాద్ , అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (మౌలిక వసతులు). ఏడ్విన్ , అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (రవాణా కార్యకలాపాలు) శ్రీనివాస్ రావు కొండా తదితరులు పాల్గొన్నారు.

వాసవ్య మహిళా మండలి సభ్యురాలు విజయ ముఖ్య ప్రసంగం చేశారు. మహిళలు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించుకోవాలంటే శారీరక, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. యోగా, ధ్యానం, పని–కుటుంబ సమతుల్యత ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మోహిత్ సోనియాకీయ మాట్లాడుతూ మహిళా విద్య సమాజ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు.

ఒక మహిళను చదివిస్తే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుందని అన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో వాణిజ్య, రవాణా, భద్రత, లెక్కల, వైద్య విభాగాల్లో మహిళా అధికారులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. విజయవాడ డివిజన్‌లో కూడా అనేక మహిళా అధికారులు ప్రతిభతో సేవలందిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. గౌరవ అతిథి వర్ష సోనియాకీయ మాట్లాడుతూ మహిళలకు గౌరవం కల్పించినప్పుడే సమాజం బలమైన కుటుంబాలు, అభివృద్ధి చెందిన సమాజం, ప్రకాశవంతమైన భవిష్యత్తును పొందుతుందని అన్నారు.

మహిళా సాధికారత అనేది కేవలం విజయాలను సంబరంగా జరుపుకోవడం మాత్రమే కాకుండా ప్రతి మహిళకు గౌరవం, అవకాశాలు, సమానత్వం కల్పించడం ద్వారా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా ఉద్యోగినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా వారంరోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్య శిబిరంతో పాటు ఆరోగ్యకరమైన వంటకాల పోటీ, ఉపన్యాస పోటీ, కవితా రచన పోటీ, రంగవల్లి పోటీలు నిర్వహించారు. మహిళా ఉద్యోగినులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలైన వారికి ముఖ్య అతిథులు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. మహిళా సాధికారతకు, సమానత్వానికి దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ కట్టుబాటును ఈ వేడుకలు మరోసారి ప్రతిబింబించాయి.

Leave a Reply