నందిగామలో నిప్పుల వర్షం

నందిగామలో నిప్పుల వర్షం
-47.4 డిగ్రీలతో మండుతున్న నియోజకవర్గం
-రాష్ట్రంలో 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..
-అప్రమత్తంగా ఉండాలంటూ ఎమ్మెల్యే సౌమ్య హెచ్చరిక
-ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దని సూచన..
నందిగామ, ఆంధ్రప్రభ:
నందిగామ నియోజకవర్గంలో ఎండలు భయానక స్థాయికి చేరుకున్నాయి. ఏకంగా 47.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో 48.1 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విజ్ఞప్తి చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రానున్న రోజుల్లో కూడా తీవ్ర వడగాలులు కొనసాగనున్నాయని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరించారు.
ఎండల ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు తరచుగా మంచి నీరు తాగాలని, దాహం లేకపోయినా శరీరానికి తగినంత ద్రవాలు అందేలా చూసుకోవాలని సూచించారు. ఒఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి శరీరాన్ని చల్లబరిచే పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే గొడుగు, టోపీ లేదా తలకు గుడ్డ కట్టుకోవాలని ప్రజలకు సూచించారు. తల తిరగడం, వాంతులు, స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే 108 అంబులెన్స్ సేవలను సంప్రదించాలని, సమీప వైద్య సిబ్బందిని ఆశ్రయించాలని సూచించారు. అప్రమత్తంగా ఉంటేనే వడదెబ్బ నుంచి రక్షణ సాధ్యమవుతుంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండి తమ కుటుంబాలను కాపాడుకోవాలి అని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు.
