ప్రకృతి.. వ్యవసాయానికి పెద్ద పీట

ప్రకృతి.. వ్యవసాయానికి పెద్ద పీట
- విత్తనం నుండి విత్తనం వరకు రైతులను తయారు చేయాలి
- పది లక్షల మందిని ప్రకృతి వ్యవసాయదారులుగా తీర్చిదిద్దాలి
- రైతు సాధికార సంస్థ సీ ఈ ఓ రామారావు
గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించేందుకు ఈ ఏడాది 10 లక్షల మంది రైతులను ‘ఎస్ టు ఎస్’ (విత్తనం నుంచి విత్తనం వరకు) రైతులుగా తయారు చేయడమే లక్ష్యమని రైతు సాధికార సంస్థ సీఈఓ రామారావు తెలిపారు. బుధవారం గుంటూరులోని ఎం.హెచ్.ఆర్ ఫంక్షన్ హాల్‌లో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి నిర్వహించిన రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016లో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్‌డ్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసినట్లు చెప్పారు. 2026 సంవత్సరాన్ని ‘ఎస్ టు ఎస్’ (ఎస్ 2ఎస్)సంవత్సరంగా ప్రకటిస్తున్నామని, ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో పనిచేసే సిబ్బంది మరియు ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు సమన్వయంతో రైతులకు మరింత సేవలు అందించాలని సూచించారు. అలాగే ఏడాది పొడవునా భూమిని పచ్చదనంతో కప్పి ఉంచే ‘ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్’ (PMDS) విధానాన్ని రైతులకు విస్తృతంగా పరిచయం చేయాలని ఆయన తెలిపారు.

సంస్థ సీనియర్ కన్సల్టెంట్ రాయుడు మాట్లాడుతూ హరిత విప్లవం పేరుతో అధికంగా వాడిన రసాయనాల వల్ల భూసారం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో దేశీయ విత్తనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు 10–12 రకాల అంతర పంటలు వేసే విధానాన్ని అనుసరిస్తే భూమిలో కర్బన శాతం పెరిగి దిగుబడులు మెరుగవుతాయని చెప్పారు. ఏకపంట విధానం వల్ల వచ్చే చీడపీడలను నివారించేందుకు ‘ఏటీఎం (ATM) ఏ గ్రేడ్’ వంటి నమూనాలను రైతులు అవలంబించేలా ప్రోత్సహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డీడీఏ కళ్యాణ్ కుమార్, డీడీహెచ్ ప్రభాకర్, రైతు సాధికార సంస్థ అధికారులు రామచంద్రరావు, చంద్రశేఖర్, చక్రవర్తి, గోపీచంద్, రాజేశ్వరరావు, హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు.
