కాలుష్యం నుండి కాపాడండి..
కాలుష్యం నుండి కాపాడండి..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మ గూడెం గ్రామ పరిసరాలలో ఉన్న హజెలో లాబరేటరీ, బృందావన్, విజె సాయి, కెమిక్ లైఫ్ సైన్స్, ఆప్టిమస్, ఎస్ వి ఆర్ లాబరేటరీస్, ఆర్కిమెడిస్, రావుస్ లేబరేటరీస్, ఎస్ వీఆర్ ట్రేడర్స్ తదితర రసాయన పరిశ్రమల వారు విపరీతమైన కాలుష్యానికి పాల్పడుతున్నారు. ఈ పరిశ్రమలు చేయు కాలుష్యం కారణంగా మా గ్రామ ప్రజలు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనేక రకాలైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ పరిశ్రమల నుంచి విపరీతమైన భరించలేని వాసన వస్తున్నది. ముఖ్యంగా హాజలో లాబరేటరీ పరిశ్రమ నుంచి ప్రతి రోజు వచ్చు వ్యర్థ వాయువుల వాసనలు భరించ లేకుండా ఉన్నాయి.
ఈ వ్యర్ధ వాయువుల కారణంగా గ్రామంలో ఉన్న వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ, గ్రామ ప్రజలు చర్మ రోగాలు, కళ్ల మంట, తలనొప్పి, పునరుత్పత్తి సమస్యలతో పాటు ప్రమాదకరమైన క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, జన్యు సంబంధమైన దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. ఈ కారణంగా గ్రామ ప్రజలు అనారోగ్యాలకు గురై ఆయుర్దాయము తగ్గి జీవించే హక్కును కోల్పోతున్నాం. ఈ కాలుష్యం విషయమై తాము అనేక సంవత్సరాలుగా ఫిర్యాదులు చేస్తున్నాము కానీ.. కాలుష్యంలో ఎటువంటి మార్పు లేదు. పరిశ్రమల నుంచి విపరీతమైన కాలుష్యం రావడమే కాకుండా, పరిశ్రమల యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా గ్రామ సమీపంలో ఉన్న పరిశ్రమలలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
గత నెల 13న బృందావన్ లేబరేటరీలో భారీ పేలుడు సంభవించి గ్రామంలో ఉన్న ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. 20 వ తేదీన గ్రామ సమీపంలో ఉన్న వి జె సాయి కెమ్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ పేలుడు సందర్భంలో పరిశ్రమ నుంచి వచ్చిన విషవాయువుల కారణంగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్రామ సమీపంలో ఉన్న పరిశ్రమల నుంచి వసూలు చేసిన 4,68,20,000 రూపాయల పర్యావరణ పరిహారంను వినియోగించి పరిశ్రమలు చేయు వాయు కాలుష్యాన్ని గుర్తించుటకు గాను, మా గ్రామంలో CAAQM station (continuous ambient air quality monitoring station) తక్షణమే ఏర్పాటు చేయించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
లాభాపేక్షే ధ్యేయంగా, నిబంధనలు ఉల్లంఘిస్తూ కాలుష్యానికి పాల్పడుతూ, ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి తీవ్ర హాని కలగజేస్తున్న ఈ పరిశ్రమలను ఇక్కడ నుండి శాశ్వతంగా తరలించాలని బాధిత రైతులు రావుల ధనలక్ష్మి, కలమ్మ, స్వప్న, అమృత, వస్పరి ప్రభ, బుచ్చమ్మ, సత్తమ్మ, భారతమ్మ, అండాలు, కిష్టమ్మ, ముత్తమ్మ, జంగమ్మ, రాములమ్మ, ఇందిరమ్మ, మల్లమ్మ, సుగుణమ్మ, కమలమ్మ, దామోదర్ రెడ్డి, రామ్ రెడ్డి, నరసింహ, లింగయ్య, మహేష్, రవీందర్, జంగయ్యలు ఉన్నతాధికారులను కోరారు.

