శ్రీశైలం వెళ్లే భక్తులు ఓవర్‌లోడ్ ప్రయాణాలు చేయవద్దు..

శ్రీశైలం వెళ్లే భక్తులు ఓవర్‌లోడ్ ప్రయాణాలు చేయవద్దు..

ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచన.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు వైపు నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనార్థం వెళ్లే భక్తులు వాహనాల్లో ఓవర్‌లోడ్‌గా ప్రయాణించవద్దని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కర్నూలు జిల్లా మీదుగా భారీ సంఖ్యలో భక్తులు శ్రీశైలం వెళ్లుతున్న నేపథ్యంలో మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని స్పష్టం చేశారు.

ముఖ్యంగా ఆటోలు, జీపులు, ట్రాక్టర్లు మరియు ఇతర చిన్న వాహనాల్లో ఓవర్‌లోడ్‌గా ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రణలో ఉంచాలని, అలసటగా ఉన్నప్పుడు కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాతే ప్రయాణం కొనసాగించాలని పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో ఎక్కడైనా సమస్యలు తలెత్తినా లేదా రోడ్డు ప్రమాదాలు జరిగినా వెంటనే సమీప పోలీసులను సంప్రదించాలని సూచించారు.

భక్తుల భద్రత కోసం పోలీసులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించి సహకరించాలని కోరారు. అలాగే వాహనాల్లో వంట గ్యాస్ సిలిండర్లు రవాణా చేసే సమయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భక్తుల క్షేమమే పోలీసు శాఖకు ప్రధాన లక్ష్యమని, అందరూ సురక్షితంగా ప్రయాణించేందుకు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఓవర్‌లోడింగ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. 2025 సంవత్సరంలో 401 కేసులు, 2026లో ఫిబ్రవరి వరకు 43 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

Leave a Reply