మహిళా శాస్త్రవేత్త స్రవంతి.. ఆత్మవిశ్వాసమే ఆమె ప్రగతి!

మహిళా శాస్త్రవేత్త స్రవంతి.. ఆత్మవిశ్వాసమే ఆమె ప్రగతి!
- విమర్శలను ఎదుర్కొని.. వ్యవసాయ రంగంలో మేటిగా నిలిచి..
- భవిష్యత్ తరాలకు ఆదర్శం.. బెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ యూ. స్రవంతి
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ ; మహిళ తనలోని సామర్థ్యాన్ని నమ్మి లక్ష్యసాధన దిశగా కృషి చేస్తే విజయాన్ని ఎవరూ ఆపలేరు” అని నిరూపించారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యూ. స్రవంతి. ఆడపిల్లలకు సరైన అవకాశాలు, కుటుంబ ప్రోత్సాహం లభిస్తే వారు ఏ రంగంలోనైనా పురుషులకు తీసిపోని విధంగా రాణించగలరని ఆమె జీవితం చాటిచెబుతోంది.
అమ్మ మాట.. ఎదుగుదలకు బాట
సింగరేణి ఉద్యోగి శంకరయ్య, గృహిణి లక్ష్మి దంపతుల ముగ్గురు కుమార్తెలలో చిన్న కూతురు స్రవంతి. “పెళ్లి కంటే ముందు స్వయం సమృద్ధి సాధించాలి.. నీ కాళ్లపై నువ్వు నిలబడాలి” అని ఆమె తల్లి చిన్నప్పుడే నాటిన బీజం స్రవంతిని ఉన్నత శిఖరాలకు చేర్చింది. స్కూలు స్థాయి నుంచే టాపర్‌గా నిలిచిన ఆమె, ఎవరిపై ఆధారపడకుండా తన పనులు తాను చేసుకునే స్వతంత్ర వ్యక్తిత్వంతో ఎదిగారు.
భిన్నమైన మార్గం.. ఉన్నత లక్ష్యం
చాలా మంది ఎంచుకునే ఎంబీబీఎస్ వైపు వెళ్లకుండా, వ్యవసాయంపై మక్కువతో ఉద్యాన పంటల రంగాన్ని ఎంచుకున్నారు. బీఎస్సీ పూర్తి చేశాక ఉపాధి హామీ పథకంలో ఈసీగా పనిచేస్తూనే, ఉన్నత చదువులపై దృష్టి పెట్టారు. మహారాష్ట్రలోని అకోలా విశ్వవిద్యాలయంలో పీజీ, హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో కూరగాయ పంటలపై పీహెచ్‌డీ పూర్తి చేశారు.
విమర్శలను దాటి.. విజయ తీరానికి. .
“ఎక్కువ చదివితే పెళ్లి కష్టమవుతుంది.. తగిన వరుడు దొరకడు” వంటి సామాజిక విమర్శలు ఎదురైనా కుంగిపోకుండా లక్ష్యాన్ని కొనసాగించారు. పీహెచ్‌డీ చివరి ఏడాదిలోనే జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా ఎంపికై తన సత్తా చాటారు. పెళ్లయిన తర్వాత, ఇద్దరు పిల్లలు పుట్టినా భర్త హరీష్ సహకారంతో థీసిస్ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా సాధించడం ఆమె పట్టుదలకు నిదర్శనం.
రైతు సేవలో ఎనిమిదేళ్లు
గత 8 ఏళ్లుగా మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని రైతులకు కేవీకే ద్వారా శాస్త్రీయ సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తూ ఆదర్శ శాస్త్రవేత్తగా సేవలందిస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్న డాక్టర్ స్రవంతి నేటి తరం యువతులకు నిజమైన రోల్ మోడల్.
