డిండి ఎత్తిపోతల పథకానికి వెన్నుపోటు..

డిండి ఎత్తిపోతల పథకానికి వెన్నుపోటు..
సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి వెన్నుపోటు పొడుస్తున్నా నల్లగొండ జిల్లా మంత్రులు పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి అన్నారు. డిండి ఎత్తిపోతల ద్వారా శివన్నగూడెం రిజర్వాయర్ కు కృష్ణా జలాలను తెచ్చి అక్కడి నుండి లిఫ్ట్ ద్వారా రాచకొండలో రిజర్వాయర్ ను ఏర్పాటుచేసి, మండల రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మండల శాఖ అధ్యక్షులు సుర్వి రాజు గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండి కూడా మన ప్రాంతానికి ప్రాజెక్టుల పై జిల్లాకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని పట్టించుకోక పోవడం విచారకరమన్నారు.
మునుగోడు నియోజకవర్గం రైతాంగానికి నారాయణపురం మండల రైతాంగానికి ఈ జిల్లా మంత్రులు పని చేయాలని లేని యెడల భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఉద్యమానికి తెరలేపుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా మంత్రులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు దాసోజు వెంకటాచారి, జిల్లా నాయకులు వంగరి రఘు, బీజేవైఎం మండల అధ్యక్షులు ఉష్కాగుల గిరిబాబు గౌడ్, సింగం బిక్షపతి, బద్దం యాదయ్య గౌడ్, సంగిశెట్టి లక్ష్మీనారాయణ, కోవూరు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
