పేద విద్యార్థుల కలలను సాకారం చేయడమే లక్ష్యంగా..

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థుల కలలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న “హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ పూర్” సామాజిక సంస్థ, శనిగరంలోని ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అండగా నిలిచింది. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో వార్షిక పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు పరీక్షా ప్యాడ్‌లు, కంపాస్ బాక్స్‌లు, పెన్నులు పంపిణీ చేశారు.
ఈ చొరవ విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకుంది. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులకు, అనాథ పిల్లలకు, వికలాంగులకు కుల, మతాలకు అతీతంగా విద్య, వైద్య రంగాల్లో సేవలు అందిస్తోంది. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఈ సంస్థ ముందుంటుంది.
అంతేకాకుండా నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా వీరి ముఖ్య ఉద్దేశ్యం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన ఉపాధ్యాయులు ఫ్రాన్సిస్ జేవియర్ మాట్లాడుతూ.. హెల్పింగ్ హ్యాండ్స్ చేస్తున్న సేవలను కొనియాడారు. పదవ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, శ్రద్ధగా చదివి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని దిశానిర్దేశం చేశారు.
ఇలాంటి సహాయ సహకారాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నటరాజ్, శ్రీనివాస్, సుశీల,మంజుల,సుధారాణి,రవూఫ్,వెంకట్రాం, నర్సయ్యతో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు
