ముఖ్యమంత్రి పర్యటనకు అధికారుల ఏర్పాట్లు..

ముఖ్యమంత్రి పర్యటనకు అధికారుల ఏర్పాట్లు..
హెలి ప్యాడ్ బహిరంగ సభ స్థల పరిశీలన..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో ఈనెల తొమ్మిదో తేదీన పర్యటించనున్నారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో ఈనెల 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో డోన్ శాసనసభ్యుడు కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి,జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, ఆర్డిఓ నరసింహులు వివిధ శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు.ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల ప్రాంగణం, హెలిప్యాడ్, ప్రజల కోసం చేయాల్సిన సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, రవాణా మరియు ఇతర అవసరాలపై అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజముద్రలతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభను నిర్వహించారు. ఇప్పటికే స్థానిక శాసనసభ్యులు జిడిపి నాయకులతోనూ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరయ్యే కార్యకర్తలకు అన్ని వసతి సదుపాయాలను కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నుంచి డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలోకి వచ్చేంతవరకు వచ్చిన తర్వాత కార్యకర్తల సమావేశంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. డోన్ మండలం కొత్త బురుజులో ముఖ్యమంత్రి పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ జరిగే కార్యక్రమాన్ని సమావేశాన్ని టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
