కన్నతల్లిపై కర్కశత్వం

కన్నతల్లిపై కర్కశత్వం

  • మద్యానికి డబ్బులు ఇవ్వలేదని గొడ్డలితో దాడి
  • వృద్ధురాలి పరిస్థితి విషమం

తొర్రూరు,ఆంధ్రప్రభ : అవసాన దశలో తల్లిదండ్రులకు ఆసరా అవతారనుకున్న సంతానం మానవత్వం మరిచి కన్నవారిపైనే కర్కశంగా దాడి చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల లచ్చమ్మ (70) పెన్షన్ పై ఆధారపడి జీవనం సాగిస్తుంది. ఆమె కుమారుడు చిట్టి మల్ల యాకయ్య (అజీమ్) పని పాట లేకుండా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు.

దీంతో భార్య అతడిని వదిలేసి పుట్టింటికి వెళ్ళింది.మద్యం కోసం రోజు కన్నతల్లిని వేధిస్తున్నాడు. బుధవారం రాత్రి భోజనం చేసి లచ్చమ్మ నిద్రలోకి జారుకుంది. ఆ సమయంలో తప్ప తాగి ఇంటికి వచ్చిన యాకయ్య నిద్రలో ఉన్న తల్లిని లేపి మద్యానికి డబ్బులు కావాలంటూ ఇబ్బంది పెట్టాడు. నా దగ్గర డబ్బులు లేవు నాయనా నన్ను వదిలేయరా అని బ్రతిమిలాడింది. నాకు డబ్బులు ఇవ్వవా అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ఇంట్లో ఉన్న గొడ్డలితో తల్లి మెడ కాలు చేతులపై నరికాడు.

తీవ్ర రక్తస్రావంతో తల్లి విలవిలలాడింది. స్థానికులు గమనించి యాకయ్యను దూరంగా పంపించారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరిన వృద్ధురాలిని స్థానికులు 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం కు తరలించారు.ఈ ఘటనపై స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.

Leave a Reply