సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు

సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు

  • విద్వేష పోస్టులు షేర్ చేస్తే చర్యలు తప్పవు
  • సోదరభావంతో పండుగలు నిర్వహించుకోవాలి
  • ర్యాలీల్లో డీజేలకు నో పర్మిషన్
  • డీఎస్పీ పల్లె శ్రీనివాసులు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : రానున్న రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగలను శాంతి, సోదరభావంతో నిర్వహించుకోవాలని అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అచ్చంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, పండుగల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం నిర్వహించిన పీస్ కమిటీ (శాంతి సమావేశం) సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ అధ్యక్షత వహించగా, సీఐ నాగరాజు, హిందూ–ముస్లిం, ధార్మిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఐ ఏ. నాగరాజు మాట్లాడుతూ తాను అచ్చంపేటలో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మతపరమైన గొడవలు జరగలేదని తెలిపారు. ఇక్కడి ప్రజల మధ్య ఉన్న సోదరభావం తనకు ఎంతో నచ్చిందని అన్నారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు షేర్ చేసే వారిని పోలీసులు గమనిస్తున్నారని, ఇప్పటికే కొంతమందిని గుర్తించడం జరిగిందని అన్నారు.

దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే విద్వేషపూరిత పోస్టులను నమ్మకూడదని, వాటిని ఇతర గ్రూపులకు పంపకూడదని సూచించారు. గ్రూప్ అడ్మిన్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ వదంతులు వ్యాపించకుండా చూడాలని అన్నారు. ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత అని, అయితే ప్రజలపై కేసులు నమోదయ్యేలా ప్రవర్తించకూడదని సూచించారు.

డీఎస్పీ పల్లె శ్రీనివాసులు మాట్లాడుతూ అచ్చంపేట ప్రాంత ప్రజలు పోలీస్ శాఖకు అద్భుత సహకారం అందిస్తున్నారని అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న పండుగల సందర్భంగా ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించే సమయంలో పరస్పర సమన్వయం పాటించాలని సూచించారు. స్తంభాలపై జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో పోటీలు పడుతూ ఆధిపత్య ధోరణి ప్రదర్శించకుండా, విద్యుత్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

హిందూ–ముస్లిం కమిటీలు ముందుగానే సమావేశాలు నిర్వహించి పరస్పరం చర్చించుకోవాలని సూచించారు. ర్యాలీలలో డీజేలను పూర్తిగా నిషేధిస్తున్నామని, నాలుగు లేదా ఐదు మైకులతో మాత్రమే ర్యాలీలు నిర్వహించుకోవాలని సూచించారు. డీజే శబ్దాల వల్ల ఆస్పత్రులు, నివాస ప్రాంతాల్లో రోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అచ్చంపేట పట్టణంలో వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని, ప్రజలు ఈ విషయంలో సహకరించాలని కోరారు.

ఇతర దేశాలలో జరుగుతున్న ఘటనలకు సంబంధించిన రెచ్చగొట్టే పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి పోస్టులను గ్రూపుల్లో పంపితే గ్రూప్ అడ్మిన్లూ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ర్యాలీలు, ఉత్సవాల సమయంలో ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రసంగాలు చేయకూడదని సూచించారు. ఈ ప్రాంతానికి ఉన్న మంచి పేరును చెడగొట్టొద్దని కోరారు.

మస్జిదులు, దేవాలయాలు, వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, నేర నియంత్రణలో భాగస్వాములు కావాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దర్యాప్తు జరుగుతుందని, అట్టి పోస్టులు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా హిందూ, ముస్లిం ప్రజలు మతాలకు అతీతంగా ప్రతి పండుగను సోదరభావంతో నిర్వహించుకుంటూ వస్తున్నారని, భవిష్యత్తులో కూడా అదే సంప్రదాయం కొనసాగుతుందని సమావేశంలో పాల్గొన్న హిందూ, ముస్లిం ధార్మిక కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు మంగ్యా నాయక్, రంగినేని రవీందర్, ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఖదీర్, ప్రధాన కార్యదర్శి ఎస్కె కరీం, కోశాధికారి ఖలీల్, మైనారిటీ నాయకులు సిద్ధిక్, రఫిక్, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు పోకల శ్రీధర్, కటకం ప్రకాష్, కేతేపల్లి వెంకటేష్, చందు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply