అక్రమ ఇసుక తవ్వకాల ప్రచారం అవాస్తవం..

అక్రమ ఇసుక తవ్వకాల ప్రచారం అవాస్తవం..
- అన్నారం బ్యారేజ్ వద్ద ఇసుక తవ్వకాలు జరగలేదు
- పరీక్షల నిర్వహణ కోసమే డీసిల్టేషన్ పనులు
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ బాబు
మహాదేవపూర్,ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం బ్యారేజ్ వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మహాదేవపూర్ డివిజన్ -2 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ ప్రచారం దుష్ప్రచారమని, ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఎస్ఏ (NDSA) సిఫార్సుల మేరకు సాగునీటి శాఖ ప్రతిష్టాత్మక సంస్థ అయిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS), పుణేను సంప్రదించిందని తెలిపారు. ఎన్డీఎస్ఏ సూచించిన అన్ని పరీక్షలు, సాంకేతిక పరిశోధనలు నిర్వహించే పూర్తి బాధ్యతను సీడబ్ల్యూపీఆర్ఎస్కు అప్పగించినట్లు చెప్పారు. పరీక్షల ఫలితాల ఆధారంగా బ్యారేజ్ పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించినట్లు వివరించారు.
సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు వివిధ సాంకేతిక పరీక్షలు నిర్వహించాలంటే బ్యారేజ్ ప్రాంతం పూర్తిగా ఇసుక, నీరు లేకుండా స్వచ్ఛంగా ఉండాలని స్పష్టంగా తెలియజేశారని చెప్పారు. ప్రతి సంవత్సరం అన్నారం బ్యారేజ్ తక్షణ అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్ ప్రాంతాల్లో భారీగా ఇసుక పేరుకుపోతుండటంతో ముందుగానే డీసిల్టేషన్ ప్రతిపాదన చేసినట్లు తెలిపారు.

ఒప్పందం కుదుర్చుకున్న ఏజెన్సీలు సాగునీటి శాఖ, టీజీఎండీసీ అధికారుల పర్యవేక్షణలోనే బ్యారేజ్ తక్షణ అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్ ప్రాంతాలు ఫ్లోర్‌పై ఇసుక తొలగింపు పనులు నిర్వహిస్తున్నాయని చెప్పారు. నిర్మాణంపై అవసరమైన పరీక్షలు చేయాలంటే ఇసుక, నీరు లేకుండా ఉండటం తప్పనిసరి అని వివరించారు.

వెంట్ల (వెంట్ పోర్షన్ ) భాగంలో ఇసుక తొలగించకుండా గ్రిడ్ మార్కింగ్ చేయడం, విలువలు నమోదు చేయడం, కొలతలు తీసుకోవడం సాధ్యం కాదని తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసమే ఇసుక తొలగిస్తున్నామని, ఈ ప్రక్రియలో బ్యారేజ్ నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగడం లేదని స్పష్టం చేశారు.

ఇది పియర్స్ (పైర్స్ ), ఫ్లోర్ భాగాల సాంకేతిక పరీక్షల కోసమే చేపట్టిన ప్రత్యేక చర్య అని పేర్కొన్నారు.
అన్నారం బ్యారేజ్ వద్ద ఎలాంటి అక్రమ ఇసుక తవ్వకాలు జరగడం లేదని, అన్ని పనులు పూర్తిగా అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ బాబు తెలిపారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని కోరారు.
