నేటి నుండి ఈ నామ్ 1.0 ద్వారానే కొనుగోళ్లు..

నేటి నుండి ఈ నామ్ 1.0 ద్వారానే కొనుగోళ్లు..
నిజామాబాద్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఈ రోజు నుంచి పాత పద్ధతిలో ఈనామ్ 1.0లో పసుపు క్రయవిక్రయాలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. రైతుల కష్టాల పై స్పందించిన ఎంపీ ధర్మపురి అరవింద్, అధికారులకు పసుపు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో ఈనామ్ 2.0 ద్వారా జరుగుతున్న కొనుగోళ్ల జాప్యం పై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి స్పందించారు. బుధవారం సాయంత్రం జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మార్కెటింగ్ అధికారులు, వ్యాపారస్తులు ఇప్పటి వరకు ఈయన 1.0 ద్వారా సక్రమంగా కొనుగోళ్లు జరిగాయని, ఇప్పటి నుండి ఈ నామ్ 2.0 ద్వారా కొనుగోలు చేయాలని ఉన్నతా ధికారులు ఆదేశాలు జారీ చేశారన్నారు.
ఈ నామ్ 2.0 వర్షన్ లో రైతులకు లాట్ ఐడీలు జారీ చేయడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రైతుల మొబైల్ నెంబర్ల ఎంట్రీ తప్పనిసరి తదితర కారణాలతో ప్రక్రియ ఆలస్యం అవుతుందని వారు వివరించారు. వివరాలు తెలుసుకున్న వెంటనే ఎంపీ అర్వింద్ ఢిల్లీలోని సంబంధిత ఈ నామ్ జాయింట్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన చిన్మయి గోత్మారేతో చరవాణి ద్వారా రైతులు, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద ఎత్తున పసుపు వస్తున్నదని, ఈనామ్ 2.0 లో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని, దీని వల్ల రైతులు, వ్యా పారస్తులు, మార్కెటింగ్ అధికారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వారికి వివరించారు.

ఈనామ్ 2.0 లో ఉన్న సాంకేతిక ఇబ్బందులను సత్వరమే పరిష్కరిం చాలని, ప్రస్తుత సీజన్ ముగిసే వరకు ఈ నామ్ 1.0 ద్వారానే కొనుగోళ్ళ ప్రక్రియ చేపట్టాలని ఎంపీ కోరారు. దీని పై జాయింట్ సెక్రెటరీ గోత్మారే స్పందిస్తూ.. ఈ నామ్ 2.0లో గల సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తామని, అప్పటి వరకు ఈ నామ్ 1.0 ద్వారానే కొనుగోలు జరిగేలా తగు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కాగా నిన్న సాయంత్రమే ఈ నామ్ 1.0 ద్వారా కొనుగోలు చేపట్టాలని మౌఖిక ఆదేశాలు వచ్చినప్పటికీ, ఈరోజు ఉదయం సాఫ్ట్వేర్ లో తగు మార్పులు చేసి సమస్యను పరిష్కరించారు. తమ సమస్య లను సత్వరమే పరిష్కరించి, కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా కొనసాగేలా చర్య తీసుకున్న ఎంపీ కి అధికారులు, వ్యాపారస్తులు, రైతులు ధన్యవాదాలు తెలియజేశారు.

