ఇందిరమ్మ ఇళ్లపై వివాదం..

ఇందిరమ్మ ఇళ్లపై వివాదం..
- ఒకే ఇంట్లో ఇద్దరికీ ఇళ్లు ఎలా?
- అధికారులు విచారణ జరపాలి…
- బీజేపీ కౌన్సిలర్ కన్నం యుగేందర్ డిమాండ్
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి మున్సిపాలిటీ నాలుగో వార్డులో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. వార్డు కౌన్సిలర్, బీజేపీ రాష్ట్ర నాయకుడు కన్నం యుగేందర్ గురువారం జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ నాయకుడు ముంజాల రవీందర్ పై పలు ఆరోపణలు చేశారు. తమ వార్డులో 11 మంది లబ్ధిదారులకు అధికారుల ద్వారా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల అనంతరం ఓటమిపాలైన ముంజాల రవీందర్, లబ్ధిదారులకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను తన వద్ద ఉంచుకుని “మేమే ఇస్తున్నాం” అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఈ నెల 20న కాంగ్రెస్ అనుబంధంగా ఉన్న ఐదుగురికి మాత్రమే ప్రొసీడింగ్ కాపీలు అందజేసి, వారిలో ఒకరికి ఇల్లు నిర్మాణ పనులకు పాలకాయ కొట్టి వాట్సాప్ గ్రూపులలో ప్రచారం చేశారని తెలిపారు. మిగతా ఆరుగురు లబ్ధిదారులు తనకు ఓటు వేయలేదనే కారణంతో వారికి ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వకుండా భయాందోళనకు గురి చేస్తున్నా రని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అధికారులు లేదా ప్రజాప్రతినిధులు లేదా ఎమ్మెల్యే అందజేయాల్సి ఉండగా, ఒక పార్టీ నాయకుడి వద్ద ప్రొసీడింగ్ కాపీలు ఎలా ఉన్నాయో అధికార యంత్రాంగం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా 11 మంది లబ్ధిదారుల్లో ఒకరైన ముస్కే రమేష్ కుటుంబంలో భార్యకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, తల్లికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో ఇద్దరికీ ఇళ్లు మంజూరు కావడం ఎలా జరిగిందని ప్రశ్నించారు. వార్డులో ఇంకా పేదలు ఉన్నప్పటికీ వారికి ఇళ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారులు విచారణ జరిపేలా స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలని, లేనిపక్షంలో రెండు మూడు రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యాలయ కార్యదర్శి వట్టెం తిరుపతి, అర్బన్ జనరల్ సెక్రెటరీ కర్వేద మనోహర్ రెడ్డి, యువమోర్చా రాష్ట్ర నాయకులు ఓరుగంటి భగవాన్, మీడియా సెల్ కార్యదర్శి మునీందర్, నాయకులు వినయ్, జోడు కృష్ణ, రామకృష్ణ పాల్గొన్నారు.
