కుమ్మేర మల్లన్న జాతర ఘటనపై నిరసన..

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా తాండూర్ మండలం కుమ్మేర మల్లన్న జాతరలో జరిగిన దారుణ ఘటనపై యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు బేజాడి వినోద మాట్లాడారు. జాతరకు వచ్చిన ఓ చాకలి కుటుంబంపై దాడి చేసి, ఐదు నెలల పసికందును హత్య చేసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దర్శనం టికెట్ కొనలేమని, బయట నుంచే దర్శనం చేసుకుంటామని చెప్పిన కుటుంబంపై దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు.
మహిళపై అసభ్య పదజాలంతో దూషించి, దంపతులను గదిలో నిర్బంధించి, కులం పేరుతో అవమానించారని ఆరోపించారు. చివరికి ఐదు నెలల శిశువును గొంతు నులిమి హత్య చేయడం అత్యంత దారుణమని అన్నారు. ఘటనకు ఐదు రోజులు గడిచినా నిందితులను అరెస్ట్ చేయకపోవడం ఆందోళనకరమని, బాధితులకు న్యాయం చేయడంలో పోలీసుల వైఖరి ప్రశ్నార్థకంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి వెంటనే నిందితులను అరెస్ట్ చేసి, వేగవంతమైన న్యాయవిచారణ కోసం ప్రత్యేక (ఫాస్ట్ ట్రాక్) కోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
