AP | నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

AP | నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం..
- ఎన్టీఆర్ జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
- హాజరు కానున్న 76,908 మంది విద్యార్థులు..
- పరీక్షల కోసం 98 కేంద్రాలు..
AP, విజయవాడ, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరం 36,928 మంది, ద్వితీయ సంవత్సరం 39,980 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, మొత్తం 76,908 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 98 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలు కల్పించారు. పరీక్షల సజావుగా నిర్వహణ కోసం 1,235 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అదనంగా 4 సిట్టింగ్ స్క్వాడ్లు, 4 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు.
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఆలస్యంగా వచ్చే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు కనీసం అర్థగంట ముందుగానే, అంటే ఉదయం 8.30 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలకు అనుమతించేది లేదంటూ అధికారులు కరాకండిగా చెబుతున్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు తెలిపారు.
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా నిషేధించబడ్డాయని, నియమాలను ఉల్లంఘించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్ పరీక్షల్లో అక్రమాలకు తావు లేకుండా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ గుంపులుగా చేరడాన్ని నిషేధించారు. పోలీసు బందోబస్తుతో పరీక్షల నిర్వహణను భద్రంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. 0866-2442362 నంబర్ ద్వారా పరీక్షలకు సంబంధించిన సమాచారం, సమస్యల పై సహాయం పొందవచ్చని అధికారులు తెలిపారు.
