రేణుక ఎల్లమ్మ విగ్రహమూర్తుల ఊరేగింపు

ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి విగ్రహమూర్తులను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్రగా తీసుకెళ్లి, భక్తుల నామస్మరణల మధ్య ఆలయానికి చేర్చారు.
ఆలయానికి చేరుకున్న అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమ కార్యక్రమం నిర్వహించారు. తరువాత విగ్రహమూర్తులకు జలాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, శయ్యాధివాసం వంటి శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నెల 22న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరగనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి గౌడ కులస్తులతో పాటు గ్రామస్తులందరి సహకారం లభించిందని వారు పేర్కొన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
