surveillance | డ్రగ్స్,గంజాయిపై ప్రభుత్వం విఫలం

surveillance | డ్రగ్స్,గంజాయిపై ప్రభుత్వం విఫలం
రాష్ట్రంలో ఏరులై పారుతున్న మాదకద్రవ్యాలు…
మదనపల్లి బాలిక ఘటన ఇందుకు నిదర్శనం..
అవగాహన పేరుతో తూతూ మంత్రపు ప్రచారమే..
గంజాయి, డ్రగ్స్‌పై కఠిన చర్యలు చేపట్టాలి..
నిరంతర నిఘా అవసరం..
ఏపీపీసి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
surveillance | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభః రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా విమర్శించారు. డ్రగ్స్‌పై డేగ కన్ను ఉంటుందని, ఉక్కుపాదం పడుతుందని కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని, కానీ వాస్తవంగా చూస్తే అవన్నీ కేవలం ఆర్భాటాలకే పరిమితమయ్యాయని అన్నారు. అవగాహన కార్యక్రమాల పేరుతో జరుగుతున్న ప్రచారం తూతూ మంత్రంగా మారిందని, రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలు ఏరులై పారుతున్నాయని ఆరోపించారు. దీనికి నిదర్శనంగా మదనపల్లిలో జరిగిన ఏడేళ్ల బాలికపై హత్యాచార ఘటనను పేర్కొన్నారు.
గంజాయి మత్తులో పసిబిడ్డపై జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్రంలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో చూపుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు మళ్లీ పునరావృతం కాకుండా ఇకనైనా ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
గంజాయి, డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. రాష్ట్ర యువత భవిష్యత్తును కాపాడాలంటే మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తప్పనిసరిగా అవసరమని వైఎస్ షర్మిలా రెడ్డి స్పష్టం చేశారు.
