Paddy prohibited వరికి ఆకస్మిక ఉరి Andhra Prabha SPL Story

Paddy prohibited వరికి ఆకస్మిక ఉరి Andhra Prabha SPL Story
అర్థంతర నిషేధం
— సాగుకు నీరు వృథా వద్దు
— అర్థవీడు రైతులకు ఇరిగేషన్ అధికారి హుకుం
— దమ్ము చేసి నాట్లు వేయబోతుండగా ఆదేశాలు
— నట్టేట్లో అన్నదాతలు అయోమయం
(అర్ధవీడు, ఆంధ్రప్రభ)
చలి కాడై, ఎండగాడై, బురదను పితికి దాని నుండి బువ్వను తీసే అన్నదాతకు ఫ్యాన్ల కింద కూర్చొని, కాలు కదపని అధికారుల నుండి ఆకస్మిక ఆదేశాలు వస్తున్నాయి. రైతులు నార్లు పోసి, పెంచి, మాగాణిని దమ్ము చేసి, నాట్లు వేయబోతుండగా ఎవరో నిద్ర లేపితే మేలుకొన్న ఆ అధికారి నాట్లు వేయకండి అని ఫోన్ల ద్వారా మౌకిక ఉత్తరువులు జారీ చేశారు. ఇప్పుడు ఆ రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు చేసిన సాగు పెట్టుబడి సంగతేంటి? అయినా ఎవరో చెబితే చెరువు కింద సాగును నిలిపేదేంటి? చెరువు, చెరువులో నీటి పై హక్కు రైతులదా? లేక ఎవరో చెప్పిన వారి అడ్డానా? ఏంటా కథా? ఎవరి కోసం ఆ అధికారి వ్యథ?

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. వాగులు ఉప్పొంగాయి. చెరువులు జలకళ సంతరించుకున్నాయి. రైతుల్లో ఆశలు చిగురించాయి. అందరిలానే అర్థవీడు రైతులు ఖరీఫ్ వరి సాగు చేశారు. కోతలు కోసి దిగుబడి ఇంటికి చేర్చుకున్నారు. ఈ పంటకు పెట్టిన నీటిని చెరువులో నిల్వ నుండి ఒక్క బొట్టూ ఉపయోగించలేదు. చెరువులోకి అదనంగా చేరి బయటికి వెళుతున్న(అలుగు ) నీటితోనే సాగు పూర్తి చేశారు. కోతలు పూర్తయినా తరువాత కూడా అలుగు పారడం ఆగ లేదు. చెరువులో నీరు తగ్గలేదు. దీంతో వేసంగి సాగుకు సిద్ధమయ్యారు. నెల కిందటే వరి నార్లు పోశారు.

ఇప్పుడు అది నాటుకు వచ్చింది. ఈ క్రమంలో నాట్లు వేసేందుకు ఓ రైతు కూలీలను పిలుచుకొని మగాణి వద్దకు మంగళవారం వెళ్లారు. పొలంలోకి దిగబోతుండగా నాటు వేయకూడదని ఆ రైతుకు ఇరిగేషన్ ఏ ఈ నుండి మౌకిక ఆదేశం వచ్చింది. ఈ విషయం పై ఆంధ్రప్రభ ఇరిగేషన్ ఏఈ ని వివరణ కోరింది. నాట్లు వేయొద్దని ఆదేశించినట్లు ఆయన స్పష్టం చేశారు. చెరువు కింద కేవలం ఐదు ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయనకు స్థానికుడు ఒకరు ఫోన్ చేసి చెప్పారట. ఈ కారణంగా ఐదు ఎకరాల కోసం చెరువు నీటిని వృథా చేయకూడదనే ఉద్దేశంతో నాట్లు వద్దని చెప్పినట్లు వివరించారు. అయితే ఏఈ స్పందన దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయమన్నట్లు ఉంది.
క్షేత్రం చెబుతున్న సాక్ష్యం

ఇరిగేషన్ ఏ ఈ వాదనను క్షేత్ర పరిశీలన కొట్టిపారేస్తోంది. చెరువు కింద దాదాపు 70 ఎకరాలకు సరిపడ వరి నారు నాటు దశలో ఉంది. దాదాపు 30 ఎకరాల్లో మగాణి దమ్ము కూడా పూర్తయింది. వరుస క్రమంలో నాట్లు వేస్తారు కనుక మిగతా రైతులు దమ్ము చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే రైతులు ఎకరానికి దాదాపు రూ. 15000 వేలు ఖర్చు చేశారు. నాటు కూలీలు, అనంతర యాజమాన్య నిర్వహణ మిగిలి ఉంది.వాస్తవం ఇది.
మరి ఏఈ ఎందుకు అలా?

చెరువు కింద దాదాపు 70 ఎకరాల్లో వరి నాట్లు వేయబోతుండగా ఏ ఈ ఆకస్మికంగా సాగు నిషేధం ఎందుకు పెట్టారు? అదీ స్థానికుడు ఎవరో ఫోన్ చేసి చెబితే.. అపుడే నిద్ర మత్తు వీడినట్లు.. మేల్కొన్నట్లు వ్యవహారించారు. నెల కిందటే రైతులు వేసంగి సాగుకు సిద్దమైనప్పుడే అభ్యంతరం చెప్పాలి. కానీ అలా చేయలేదు. సినిమాలో తాళి కట్టబోతుండగా ఆపండి అన్నట్లు.. నాటు వేసేందుకు మాగాణిలో రైతు అడుగు పెట్టబోతుండగా ఏ ఈ నిషేధం విధించడం పలు అనుమానాలకు తావిస్తోంది. రైతులు చిందించిన కంపు కొట్టే చమట చుక్కల ప్రతిఫలమే నెలవారి అందుకుంటున్న జీతాలని అధికారులు గుర్తించాలి. ఇందుకు భిన్నంగా క్షేత్ర పరిశీలన లేకుండా ఎవరో చెప్పిన మాట విని రైతులను నట్టేట ముంచడం అమ్మ పాలు తాగి రొమ్మును గుద్ధినట్లే అవుతుంది. ఉన్నత అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలి.
రైతు గుడిమెట్ట

వేసంగి వరికి నారు పెంచాం. నాటుకు సిద్ధం అయ్యాం. నాతోపాటు సుమారు 70ఎకరాలకు వరినార్లు సిద్ధం అయ్యాయి .తీరా నాటు వేయబోతుండగా నాట్లు వేయ బోతుండగా అధికారులు వద్దు అని అన్నారంట ఇదేమి న్యాయం ఆపేది ఉంటే నారు పోయకముందే ఆపాలికదా.. ఇలా నట్టేట ముంచడం మోసం కదా..మాకు అన్యాయం చేయవద్దు.
