Dr. A. Siri | జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం.

Dr. A. Siri | జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం.
- 1–19 ఏళ్ల పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలి : కలెక్టర్ డా. ఏ. సిరి
Dr. A. Siri | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం నగరంలోని ఇందిరాగాంధీ స్మారక ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 4,400 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఉండగా సుమారు 6 లక్షల 57 వేల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందజేసి నులిపురుగుల నివారణ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో టామ్-టామ్ ప్రకటనలు, బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్లలో విస్తృత ప్రచారం నిర్వహించినట్లు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పనిసరిగా మాత్రలు తీసుకునేలా చూడాలని సూచించారు.

- పదవ తరగతి విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి..
పదవ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా “వంద రోజుల ప్రణాళిక” రూపొందించిందని తెలిపారు. ఈ కార్యాచరణ ప్రణాళికను సద్వినియోగం చేసుకొని బలహీనంగా ఉన్న విషయాల్లో పట్టు సాధించాలని విద్యార్థులకు సూచించారు. పదవ తరగతి వరకు మాత్రమే కాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు విద్యను కొనసాగించాలని ప్రోత్సహించారు.
- బాల్య వివాహాలపై అవగాహన…
పదవ తరగతి చదువుతున్న ఆడపిల్లలకు ఇంట్లో వివాహాల కోసం ఒత్తిడి తీసుకువస్తే ఉపాధ్యాయులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. తమ కాళ్ల మీద నిలబడిన తరువాతే వివాహం చేసుకోవాలని హితవు పలికారు. విద్య ద్వారా సాధికారత సాధించడం ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు కూడా బాల్య వివాహాలను నిరోధించడంలో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డా. భాస్కర్, ఐసిడిఎస్ పీడీ విజయ, కార్పొరేటర్ పద్మలత, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అసుదుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
