Queue lines | వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు..

Queue lines | వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు..

Queue lines | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఈఓ వి.కె. సీనా నాయక్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. శివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలను పకడ్బందీగా సన్నద్ధం చేశారు. శివాలయం, అమ్మవారి ఆలయ ప్రాంగణాలను రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.

ఈ పుష్పాలంకరణ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది. శివరాత్రి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో, భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా దర్శనం చేసుకుంటున్నారు. ఆలయంలో భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఈఓ సీనా నాయక్ ముందుగానే సమీక్షా సమావేశాలు నిర్వహించి, ఇంజనీరింగ్, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రతా విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

తాగునీరు, లైటింగ్, వైద్య సేవలు వంటి మౌలిక వసతులు భక్తులకు అందుబాటులో ఉంచారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివార్లను వధూవరులుగా అలంకరించి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, త్రికాల అభిషేకాలు, కళ్యాణోత్సవం తదితర ప్రధాన పూజాకార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాదిగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని పునీతులవుతున్నారు.

Leave a Reply