యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
అందరి జీవితాల్లో యోగా దినచర్య కావాలి: బొర్రా గాంధీ
జూన్ 21 వరకు ఉచిత యోగా శిక్షణ..
భక్తులు, సిబ్బంది నుంచి విశేష స్పందన
విజయవాడ, ఆంధ్రప్రభ-ఇంద్రకీలాద్రి: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) పేర్కొన్నారు. ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రబిందువైన ఇంద్రకీలాద్రిపై ఆరోగ్య చైతన్యానికి కూడా శ్రీకారం చుడుతూ ఆదివారం ‘యోగాంధ్ర’ ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు దేవస్థానం మహామండపం ఆరో అంతస్తులో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది, అర్చకులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రముఖ యోగా శిక్షకుడు గర్రె రాజేష్ ఆధ్వర్యంలో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన విధానాలపై సమగ్ర శిక్షణ అందించారు. ఆరోగ్యవంతమైన జీవనశైలికి యోగా ఎంతగానో దోహదపడుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్వయంగా సిబ్బందితో కలిసి యోగాసనాలు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలైతే, యోగా మనస్సు, శరీరాన్ని సమతుల్యం చేసే సాధనమని పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, ఆరోగ్యం రెండింటికీ అవినాభావ సంబంధం ఉందని వివరించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవమైన జూన్ 21 వరకు ప్రతిరోజూ నిర్వహించే ఈ ఉచిత యోగా శిక్షణ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రారంభ కార్యక్రమంలో దేవస్థాన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పెనుమత్స రాఘవరాజు, ప్రత్యేక ఆహ్వానితుడు వెలగపూడి శంకరబాబు, దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన భక్తులకు దేవస్థానం తరఫున ఉచిత ప్రసాదాలు, మంచినీరు పంపిణీ చేశారు.
ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన ‘యోగాంధ్ర’ కార్యక్రమం భక్తులు, స్థానికుల్లో విశేష ఆదరణ పొందుతోంది.
