మాతా శిశు మరణాలు తగ్గాలి

మాతా శిశు మరణాలు తగ్గాలి
-డిసెంబర్ నుంచి మార్చి వరకు నలుగురి మృతిపై విచారణ
-లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
-ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: జిల్లాలో మాతా శిశు మరణాల రేటును పూర్తిగా తగ్గించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో చోటు చేసుకున్న నాలుగు మాతా శిశు మరణాలపై జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆయన లోతుగా విచారణ చేపట్టారు. మాకివలస, మెట్టూరు, రెంటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పుణ్యపువీధి అర్బన్ పీహెచ్‌సీల పరిధిలో నమోదైన మాతృ మరణాలపై ఎండీఎస్ఆర్, సీడీఎస్ఆర్ కమిటీలతో కలిసి సమీక్షించారు.
మాతృ మరణాలకు గల ప్రాథమిక వైద్య కారణాలు, క్షేత్రస్థాయి నుంచి అందిన ఆరోగ్య సేవలు, వివిధ ఆసుపత్రుల్లో లభించిన చికిత్స తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయి నుంచే పటిష్టమైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. గర్భిణులకు మొదటి త్రైమాసికం నుంచే హిమోగ్లోబిన్, బీపీ వంటి కీలక పరీక్షలతో పాటు అన్ని ల్యాబ్ టెస్టులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.
గర్భిణుల స్కానింగ్ నివేదికలను తప్పనిసరిగా జనరల్ ఫిజీషియన్లకు చూపించి వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. గర్భధారణ సమయంలో ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే తక్షణమే అప్రమత్తమై తగిన వైద్య సలహాలు, చర్యలు తీసుకోవాలని సూచించారు. శిశు మరణాల నివారణకు సైతం పలు కీలక సూచనలు చేశారు.
భ్రూణహత్యలపై ఉక్కుపాదం!
అనంతరం ప్రీ-కాన్సెప్షన్, ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (పీసీ పి ఎన్ డి టి) చట్టం పై సమీక్ష నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, చేయించుకోవడం లేదా ప్రోత్సహించడం నేరమని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 50,000 రూపాయిల వరకు జరిమానా విధిస్తామనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలని అన్నారు. జిల్లాలో ఎక్కడా భ్రూణహత్యలు జరగడానికి వీల్లేదని ఇన్చార్జి కలెక్టర్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వైద్య ఆరోగ్యశాఖ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనివేళల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండి రోగులకు ఉత్తమ సేవలు అందించాలని నిర్దేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి అనిత, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మేరీ కేతరిన్, డీపీహెచ్‌ఎన్ కె.ఎన్. విజయలక్ష్మి, డీఐఓ రామదాస్, కమిటీ సభ్యులు రిటైర్డ్ జడ్జి పప్పల జగన్నాధరావు, కె. పార్వతి, టి.డి.పి. సుబ్బలక్ష్మి, వి. సునీత, పలువురు వైద్యులు, ఏఎన్ఎంలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
