2024 Budget | సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా…

2024 Budget | సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా…

  • బడ్జెట్‌లో అన్ని వర్గాలకు పెద్దపీట..
  • హెల్తీ–వెల్తీ–హ్యాపీ ఏపీకి ముందడుగు
  • – బడ్జెట్ పై వెస్ట్ ఎమ్మెల్యే

2024 Budget | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి రాష్ట్ర బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం శనివారం గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రూపొందించబడిందని తెలిపారు. ముఖ్యంగా బీసీలకు అధిక నిధులు కేటాయించడం ఆనందకరమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం బీసీ వర్గాలను విస్మరించిందని విమర్శించిన ఆమె, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ప్రతి వర్గాన్ని సమాన దృష్టితో చూస్తోందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రాంతీయ సమతుల్యతతో అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో ఈ బడ్జెట్ రూపొందించబడిందని తెలిపారు. రాష్ట్ర విభజనతో వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, గత పాలనలో జరిగిన ఆర్థిక నష్టాల వల్ల పరిస్థితులు క్లిష్టంగా మారాయని చెప్పారు. ఆ సమస్యలను పూర్తిగా సరిచేయడానికి రెండేళ్లు సరిపోవని అయినప్పటికీ, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. 2024 బడ్జెట్ గత తప్పిదాలను సరిదిద్దే దిశగా ఉండగా, 2025 బడ్జెట్ భవిష్యత్ అభివృద్ధికి బాటలు వేస్తోందని ఆమె పేర్కొన్నారు. “స్వర్ణాంధ్ర విజన్–2047” లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రాష్ట్రాన్ని “హెల్తీ–వెల్తీ–హ్యాపీ స్టేట్”గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఈ బడ్జెట్ ఆ దిశగా ఒక కీలకమైన అడుగని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతోందని కృతజ్ఞతలు తెలిపారు.
మొత్తానికి, ఈ బడ్జెట్ స్వర్ణాంధ్రప్రదేశ్‌కు నాంది పలికేలా, రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసేలా రూపొందించబడిందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు.

Leave a Reply