great police | నేరస్తులకు నో చాన్స్..!

great police | నేరస్తులకు నో చాన్స్..!

-స్టేషన్ ఘన్ పూర్ పోలీసుల సత్వర స్పందన

కొద్ది రోజుల్లోనే లారీ టైర్ల దొంగతనం మిస్టరీ వీడింది
–ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్
–6 లారీ టైర్లు, రూ.40 వేల నగదు స్వాధీనం
-ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన ఏసీపీ భీం శర్మ

స్టేషన్ ఘన్‌పూర్, ఫిబ్రవరి13 ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్‌లో సంచలనం సృష్టించిన లారీ టైర్ల దొంగతనం కేసును పోలీసులు వేగవంతంగా ఛేదించారు. నేరస్తులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సత్వర చర్యలు తీసుకున్న పోలీసులు కొద్ది రోజుల్లోనే మిస్టరీని వీడించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర నింది తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 6 లారీ టైర్లు మరియు రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం ఏసీపీ భీం శర్మ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివ పురి జిల్లా సుభాష్‌పూర్ మండలం ఇందర్ ఘర్ గ్రామా నికి చెందిన ధర్మేందర్ సింగ్ (41), జీతేంద్ర యాదవ్ అలియాస్ టింకిల్ యాదవ్ (32) ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఇద్దరూ ఈ నెల 19న రాత్రి స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఎంఆర్‌ఎఫ్ టైర్ల షోరూమ్‌లోకి చొరబడి 12 లారీ టైర్లను దొంగిలించినట్లు విచారణలో తేలింది. కేసు నమోదు చేసి దర్యా ప్తు చేపట్టిన పోలీసులు అనుమానితుల కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎస్సై బి. వినయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి పల్లగుట్ట క్రాస్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అను మానాస్పదంగా వెళ్తున్న టాటా లారీ నెం. RJ-11-GD-3517ను ఆపి తనిఖీ చేశారు. తనిఖీలో లారీ లోపల దొంగిలించిన టైర్లు ఉండటం గుర్తించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 లారీ టైర్లు, రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కేసును వేగంగా ఛేదించి నిందితులను పట్టుకున్న ఎస్సై బి. వినయ్ కుమార్ సిబ్బందిని ఏసీపీ ఆర్. భీమ శర్మ, ఇన్‌స్పెక్టర్ జి. వేణు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పి. రాజేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply