Mella Chervu | దక్షిణ కాశీగా శివలింగం ప్రసిద్ధి

Mella Chervu | దక్షిణ కాశీగా శివలింగం ప్రసిద్ధి
- ఫిభ్రవరి15 నుండి 19 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- ఉత్సవాల నిర్వహణకు 1కోటి రూపాయల నిధులు మంజూరు
- శివరాత్రి జాతరకు హజరు కానున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Mella Chervu | మేళ్ళచెరువు, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్ళచెరువు మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ఫిబ్రవరి 15 నుండి 19 వరకు మహశివరాత్రి పండుగ సందర్భంగా నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయశాఖ అధికారులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దక్షిణకాళీగా పేరుపొందిన మేళ్ళచెరువు లోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరస్వామి దేవాలయం కాకతీయుల కాలం నుంచి నేటి వరకు కూడా అశేష భక్తుల పూజలందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరుపొందింది.
ఆలయంలోని శివలింగం ప్రత్యేకత…

మేళ్లచెర్వు శివాలయంలో పూజలందుకుంటున్న శివలింగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేవాలయం చుట్టూ పక్కల సుమారు 300 అడుగులకు పైగా తవ్విన నీరుపడని పరిస్థితుల్లో ఈ శివలింగంలో నీరు ఉండటం విశేషం. శాస్త్రవేత్తలకు అంతుచిక్కని విధంగా పంచభూత తత్వము గల ఈ శివలింగం తలభాగం వరకు జలముచే నిండి ఉంటుంది. ఈ శివలింగం నుంచి నీటిని ఎంత తీస్తే మళ్లీ అంతా జలం ఊరుతుంది. కానీ శివలింగం దాటి పైకి రాదు. ఇంకోక ప్రత్యేకత ఏమిటంటే ప్రతి పుష్కరానికి ఈ శివలింగం ఒక ఇంచు మందం పెరుగుతుందని పూజరులు చెపుతున్నారు.
ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ …
ఇక్కడి ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరస్వామి కళ్యాణోత్సవాల మహా శివరాత్రి జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలిచేవి ఎత్తైన రంగురంగుల లైటింగ్ లతో ఏర్పాటు చేసే విద్యుత్ ప్రభలు, సాంస్కృతిక నృత్య కార్యక్రమాలే. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ పరిసరప్రాంతాల్లో రంగురంగుల విద్యుత్ లైట్లతో ప్రభలను పార్టీల వారిగా కులాల వారిగా ఏర్పాటు చేసుకొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత.
బ్రహ్మోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు….
ఫిబ్రవరి15న స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో అభిషేక ఉత్సవాలు , స్వామివారి కళ్యాణం.
16న మహ శివరాత్రి రుధ్రాభిషేకాలు
రాష్ట్ర స్తాయి ఎద్దుల పందాలు, కబడ్డీ పోటీలు
17న రుధ్రాభిషేకాలు, పెద్ద రథోత్సవం పూజలు
18న అమ్మవారికి కుంకుమార్చన పూజలు, రధోత్సవం
19న అభిషేకాలు, కుంకుమార్చన పూజలు వసంతోత్సవం, పవళింపు సేవ ఆశీర్వచనమలు, పవళింపు సేవ, కీడా విజేతలకు బహుమతుల ప్రధానం .
మేళ్లచెర్వుకు పెరగనున్న భక్తుల తాకిడి..
మహాశివరాత్రి సందర్భంగా జాతరకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందని సంబంధిత అధికారులు అంచనాలు వేస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయశాఖ, ఆలయ అభివృద్ధి కమిటీ, గ్రామపంచాయతీ, పోలీస్ అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారిపై వాహనాల నిలుపుదల లేకుండా చర్యలు, పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు, దేవాలయ ప్రాంగణంలో భారీకేడ్లు ఏర్పాటు చేసి భక్తులు క్యూ పద్దతిలో స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లతో పాటు దేవాలయ ప్రాంగణం చుట్లూ పక్కల ప్రైవేట్ వాహనాలకు అనుమతులు లేకుండా కేవలం కాలినడక ద్వారానే భక్తులు దేవాలయానికి వచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.
క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు, డ్యాన్స్ పోటీలు…
జాతర సందర్భంగా మేళ్లచెర్వులో ఒంగోలు జాతి ఎద్దుల పందాలు, రాష్ట్ర స్తాయి కబడ్డి వంటి ఇతరత్రా క్రీడా పోటీలు. సాంఘీక, పౌరాణిక, జానపద నాటికలు, డ్రామాలు వేయడం ఆనవాయితీ. పార్టీల వారిగా, కులాల వారిగా రంగురంగుల ఎత్తైన విద్యుత్ ప్రభలు ఏర్పాుటు చేసి డ్యాన్స్ ప్రదర్శనలు చేపట్టనున్నారు.
ప్రత్యేక ఆర్టీసీ బస్సు సౌకర్యాలు…
మేళ్లచెర్వుజాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ, జగ్గయ్యపేట డిపోల నుంచి కోదాడ, హుజూర్నగర్ మీదుగా మేళ్లచెర్వు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే సంబంధిత డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆహ్వానం..

ఈ నెల 15 నుండి జరగనున్న మేళ్ళచెరువు శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు రాష్ట్ర నీటి పారుదల ఫౌరసరరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేశారు.
మహా శివరాత్రి ఉత్సవాల నిర్వహణకు రూ. 1.కోటి మంజూరు…
మహా శివరాత్రి సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు, అభివృధి పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేసిందని ఆలయ అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
