వైభవంగా స్వర్ణగిరి వేంకటేశ్వరుని నిత్య కళ్యాణం

  • ఘనంగా స్వామివారి తిరువీధి ఉత్సవం
  • జల నారాయణ స్వామికి మంగళహారతులు సమర్పణ

యాదాద్రి, ఆంధ్రప్రభ, ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి క్షేత్రంలో శనివారం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు,ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు. వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు. అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధ భరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు.

మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేయి నామాల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. స్వామి వారి దివ్య క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహవనంను నిర్వహించారు. శ్రీ అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పంచామృతములు, పసుపు, సుగంధ ద్రవ్యాలతో వేదమంత్రోచ్ఛారణలతో వసంతోత్సవ సేవను శోభాయ మానంగా నిర్వహించారు.

వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా సుమారు 5 వేల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.భక్తులు నయనానందకరంగా శ్రీవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో శనివారం సందర్భంగా జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు సమర్పించారు.