Andhra pradesh | వేలాది మంది విద్యార్థులకు ఊరట..

Andhra pradesh | వేలాది మంది విద్యార్థులకు ఊరట..
Andhra pradesh, విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుల కోసం రూ.1,198 కోట్ల నిధులను విడుదల చేయడం విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనమని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం తెలిపారు. 2024–2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ సంబంధిత ఉత్తర్వులను జారీ చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు భారీ ఊరట లభించిందన్నారు. ముఖ్యంగా వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద మొత్తం రూ.1,198 కోట్లకు సంబంధించిన చెల్లింపుల ఉత్తర్వులు విడుదల కావడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.
ఈ నిర్ణయం వల్ల పేద, బడుగు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా తమ విద్యను కొనసాగించే అవకాశం లభించిందన్నారు. ఫీజుల భారం కారణంగా చదువు మధ్యలో ఆపాల్సిన పరిస్థితులు తొలగిపోయాయని, ప్రభుత్వ సహకారంతో విద్యార్థుల భవిష్యత్తు మరింత భద్రమవుతోందని నెట్టెం రఘురాం వ్యాఖ్యానించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో విద్యను రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభంగా భావించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో విద్యార్థుల సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని స్పష్టం చేశారు.
విద్యకు అడ్డంకులు ఉండకూడదనే సంకల్పంతో తీసుకున్న ఈ చర్య రాష్ట్రానికి బలమైన మానవ వనరుల పునాదిని వేస్తుందని తెలిపారు. యువతకు నాణ్యమైన విద్య అందించడం ద్వారానే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కీలక నిర్ణయం సాధ్యమైనందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని నెట్టెం రఘురాం పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను స్వయంగా పర్యవేక్షిస్తూ, బకాయిల పరిష్కారం పై పట్టుదలతో ముందుకు సాగిన ఆయన కృషి ఫలితమే ఈ నిధుల విడుదల అని తెలిపారు. మాటల్లో కాకుండా కార్యాచరణలో చూపిస్తున్న ఈ నాయకత్వం యువతలో నమ్మకాన్ని పెంచుతోందని, విద్యార్థుల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి మార్గదర్శకమని ఆయన స్పష్టం చేశారు.
