డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..

బోండా ఉమా మంత్రి పదవి కోసం ఆశతో ఉన్నాడు.. ఇవ్వండి..! పేర్ని నాని


మచిలీపట్నం – ఆంధ్రప్రభ : డీఎస్సీ నియామకాలలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, అలాగే నీట్ (NEET) పరీక్షల వ్యవహారంలో తలెత్తిన అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) డిమాండ్ చేశారు. ఈ అంశాలపై బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. లోకేష్ రాజీనామా చేసి మంత్రి పదవి కోసం ఆశ పడుతున్న బోండా ఉమాకి ఇవ్వాలన్నారు.

ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

అదేవిధంగా నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జులు, పార్టీ నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.