Brs l బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి..

Brs l బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి..

కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మొద్దు
మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
9 వార్డుల్లో బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం
కారు గుర్తుకే పట్టం కట్టాలని పిలుపు

Brs l బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి 34 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఓటర్లను అభ్యర్థించారు. సోమవారం బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగింపు సందర్భంగా పట్టణంలోని 2, 4, 5, 9, 11, 12, 13, 24, 29 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఇచ్చిన మోసపూరిత హామీలను ఎండగట్టడమే లక్ష్యంగా రూపొందించిన ‘బాకీ కార్డు’ను చిన్నయ్య స్వయంగా ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార సభల్లో దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను విస్మరించి ప్రజలను నిలువునా వంచిస్తోందని ధ్వజమెత్తారు.

“గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బెల్లంపల్లి రూపురేఖలు మార్చాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించడంతో పాటు, మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం మా హయాంలోనే సాధ్యమైంది. మేము చేసిన అభివృద్ధి కళ్లముందే కనిపిస్తోంది. ఇప్పుడు ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్ నాయకులు నాడు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు” అని విమర్శించారు. కాంగ్రెస్ ఎగ్గొట్టిన బాకీలను ప్రజలు గుర్తుంచుకోవాలని, ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీపై మళ్ళీ గులాబీ జెండా ఎగురవేస్తేనే పట్టణ సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జిలు నగేష్ ముదిరాజ్, రవీందర్ రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. 2వ వార్డు అభ్యర్థి సబ్బని అరుణ్, 4వ వార్డులో ఈట కమల-లక్ష్మణ్ రావు, 5వ వార్డులో గోగర్ల స్వప్న-సత్యనారాయణ, 9వ వార్డులో కాంపెళ్లి రాజం, 11వ వార్డులో బత్తుల అనసూయ-మోక్షానందం, 12వ వార్డులో తిరుమలవాసు, 13వ వార్డులో దొంగల రాజ్ కుమార్, 24వ వార్డులో కొత్తూరి వరలక్ష్మి-చెన్నకేశవరెడ్డి, 29వ వార్డులో రాజులాల్ యాదవ్ తరఫున చిన్నయ్య ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.