Ootkur | కామాంధుడిపై ఫోక్సొ,ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మైనర్ బాలిక ను గర్భవతిని చేసిన కామాంధుడిపై పోలీసులు ఫోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. మండలంలోని ఓ కేజీబీవీ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన అరవింద్ పై బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నెల 3న ఊట్కూర్ మండలంలోని కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న బాలికను లొంగదీసుకుని గర్భవతి చేసిన ఉదంతంపై ఆంధ్రప్రభ దినపత్రికలో కథనం వెలువడింది. ఈ నేపథ్యంలో ఊట్కూర్ పోలీసులు 1098, సిడబ్ల్యుసి బెంచ్ ముందు మైనర్ బాలికను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహించి విచారణ చేపట్టారు. ఈనెల 6న మైనర్ బాలికను గర్భవతి చేసిన నిందితుడు అరవింద్ ను బాలల హక్కుల కమిషన్ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
