ప్రజా సమస్యలపై గళమెత్తుతా..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి 11వ వార్డులో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శ్రేణులు ఆదివారం ప్రభంజనం సృష్టించారు. వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి బత్తుల అనసూయ (మోర మానస మోక్షానందం) తన మద్దతుదారులు , పార్టీ ముఖ్య నాయకులతో కలిసి వార్డులోని ప్రతి గల్లీలో పర్యటించారు. గడప గడపకూ వెళ్తూ మహిళలు, వృద్ధులు, యువతను ఆత్మీయంగా పలకరిస్తూ, కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఆమెకు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు.

ప్రచార సభలో బత్తుల అనసూయ ప్రసంగిస్తూ.. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జెండా పట్టి వీధుల్లోకి వచ్చి పోరాడిన ఉద్యమకారిణిని అని గుర్తు చేశారు. అదే పోరాట పటిమతో నేడు వార్డు అభివృద్ధి కోసం కౌన్సిలర్‌గా మీ ముందుకు వచ్చానని తెలిపారు. వార్డులో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించడమే తన ప్రథమ ప్రాధాన్యత అన్నారు. మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రజల గొంతుకగా మారి సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తానని ఆమె భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు చెబుతున్నవన్నీ మోసపూరిత మాయమాటలేనని, వారి హామీలను నమ్మవద్దని 11వ వార్డు అభివృద్ధి కోసం శ్రమిస్తానని తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.

వార్డులోని ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనలో 11వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని వాగ్దానం చేశారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే, వార్డు ప్రజలకు సేవకురాలిగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని విన్నవించారు. ఈ భారీ ప్రచార కార్యక్రమంలో 11వ వార్డు మాజీ కౌన్సిలర్ లింగంపల్లి రాములు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు బొంతు భాస్కర్, రావుల దనుంజేయ, దుర్గం లింగయ్య, మోర మోక్షానందం, చింటు, దొంతమల్ల మణిరాజ్ పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మానసకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.

Leave a Reply