People Fear : వామ్మో ..గజ గమనం Andhra prabha news
People Fear : వామ్మో ..గజ గమనం Andhra prabha news
చిత్తూరు జనం గజగజ
ఇటు నాన్నోయ్ పులి హల్ చల్
వారం కిందట బావిలో పడి చిరుత మృతి
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో :
చిత్తూరు నగరం, పరిసర ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. చిత్తూరు పట్టణ ప్రజలు భయాందోళనకు (people fear) గురవుతున్న నేపథ్యంలో సంతపేట, మాంగసముద్రం, మురకంబట్టు, పూతలపట్టు, అలాగే కాణిపాకం పరిసరాల్లో అడవి ఏనుగులు తిరుగుతున్నాయన్న సమాచారం వేగంగా వ్యాపిస్తోంది. ఆదివారం ఉదయం సంతపేట సమీపంలో రెండు ఏనుగులు కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. బుడ్డమాను చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా అవి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా జంకుతున్నారు.

రాత్రి సమయంలో ఏనుగుల కదలికలు (elephants movement) ఉన్నాయని కొందరు ప్రత్యక్షంగా చూసినట్లు చెబుతూ వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై అధికారిక నిర్ధారణ కోసం అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది.

ఇటీవల చిత్తూరు సమీపంలో బావిలో పడిపోయి మృతి చెందిన పులి (tiger dead) ఘటన ఇంకా ప్రజల మదిలో ఉండగానే, ఇప్పుడు ఏనుగుల సంచారం మరింత ఆందోళన కలిగిస్తోంది. అడవులకు ఆనుకుని ఉన్న గ్రామాలు, పట్టణ పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా కేంద్రానికి సమీపంగా వన్యప్రాణులు కనిపించడం ప్రజల్లో భయాన్ని రెట్టింపు చేసింది.

“పులులు లేవు” అన్న అటవీశాఖ వ్యాఖ్యల తర్వాత పులి మృతి ఘటన వెలుగులోకి రావడం, ఇప్పుడు ఏనుగులు జనావాసాల్లోకి రావడం అధికారుల నిర్లక్ష్యమేనా? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎవరికైనా ప్రాణహాని జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏనుగులు సాధారణంగా గుంపులుగా సంచరిస్తాయి. ఆహారం, నీటి కోసం అడవుల నుంచి బయటకు రావడం సహజమే అయినప్పటికీ, జనావాసాల్లోకి రావడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు గుంపులుగా వెళ్లకుండా, దూరం పాటిస్తూ, ఏనుగులను రెచ్చగొట్టే చర్యలు చేయకూడదని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో బయట తిరగడం తగ్గించాలని సూచిస్తున్నారు.

సీసీ కెమెరాలు, గ్రామస్థుల సమాచారం, ఫారెస్ట్ సిబ్బంది గాలింపు చర్యల ద్వారా ఏనుగుల కదలికలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. వెంటనే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఏనుగులను అడవుల్లోకి మళ్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

జిల్లా కేంద్రంలో వరుసగా వన్యప్రాణుల కదలికలు నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. పరిస్థితిని అటవీశాఖ అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని, ప్రజల ప్రాణ భద్రతకు హామీ కల్పించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పట్టణవాసులు కోరుతున్నారు. అప్పటి వరకు అప్రమత్తతే రక్షణ అని అధికారులు సూచిస్తున్నారు.
