మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు…పార్టీల జోరు
మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు…పార్టీల జోరు
- హోరాహోరీగా ప్రచారం
- మారుమ్రోగుతున్న మైక్ లు,ప్రచార వాహనాలు
- వాడవాడలా మద్దతు దారులతో ప్రచారంలో అభ్యర్థులు
- తలుపు తట్టి ఇంటింటి ప్రచారం
- సాంస్కృతిక కళా ప్రదర్శనలు
- కాంగ్రెస్, బి ఆర్ ఎస్ ,బీజేపీ, సీపీఎం, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు బరిలో…
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ లో ఆయా పార్టీల అభ్యర్థులు 49 మంది బరిలో ఉండగా,మున్సిపాలిటీ లో నిత్యం పార్టీల ప్రచార హోరు ముమ్మరంగా కొనసాగుతుండగా,పార్టీ అభ్యర్థుల జోరు సాగుతోంది.ప్రచార వాహనాలు,పార్టీ కండువాలు, మైక్ సెట్ సౌండ్,ఆయా పార్టీల పాటలు,స్వతంత్ర అభ్యర్థుల కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు,వాడవాడలా మద్దతు దారులు,స్థానిక ఓటర్లతో తలుపు తట్టి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
దాదాపుగా 49 మంది కౌన్సిలర్ అభ్యర్థులు ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ప్రచార వాహనాల జోరుతో ఆయా వార్డులలో ప్రచారం కాస్త మారుమ్రోగుతుంది.శుక్రవారం బీజేపీ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ ఆధ్వర్యంలో పోతాయిగడ్డ, చెరువు కట్ట కూడళ్లలో ఎన్నికల ప్రచార సభ పెద్ద ఎత్తున జరిగింది. నేడు బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా గాధరి కిశోర్ కుమార్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగనుంది.మోత్కూర్ మెయిన్ రోడ్డు లో ,గల్లీ గల్లీలలో ప్రచారం తప్ప ఏమీ వినబడడం లేదు.పార్టీ కండువాలు,జెండాలు,టోపీలు,ఫ్లెక్సీలతో ప్రచార వాహనాల హడావుడి జోరుగా ఉంది.

మరో 3 రోజుల పాటు ప్రచారం కొనసాగనుంది.దీంతో అభ్యర్థులు లేచింది మొదలు ప్రచారం కోసం నానా తంటాలు పడుతున్నారు.ఎన్నికల సందడి తో మోత్కూర్ మున్సిపాలిటీ లో టిఫిన్,టీ,బిర్యానీ, డి జె, ఫ్లెక్సీ,మద్యం దుకాణాలు,చికెన్ సెంటర్లు,పెట్రోల్ బంక్ లు మాత్రం కళకళ లాడుతున్నాయి.వ్యవసాయ పనులు సైతం ఈ సీజన్లో లేకపోవడంతో మహిళలు పెద్దఎత్తున అభ్యర్థులతో పాటు ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు.పోటాపోటీగా రోజుకొక్క అభ్యర్థి తమ జనబలం చూపించేందుకు మహిళలు, వృద్ధులను తమ వెంట తిప్పుకుంటున్నారు.

