Vijayawada | కేంద్ర బడ్జెట్‌లో పర్యాటక రంగానికి చారిత్రక ప్రాధాన్యం..

Vijayawada | కేంద్ర బడ్జెట్‌లో పర్యాటక రంగానికి చారిత్రక ప్రాధాన్యం..

  • సీప్లేన్‌ల తయారీ నుంచి బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధి వరకు విస్తృత ప్రణాళికలు..
  • నాగార్జున కొండకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దిశగా అడుగులు
  • యువతకు 10 వేల మందికి నైపుణ్య శిక్షణ
  • రూ.2,581 కోట్ల కేటాయింపు

Vijayawada | విజయవాడ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026 వార్షిక బడ్జెట్‌లో పర్యాటక, ఆతిథ్య రంగాలకు విశేష ప్రాధాన్యం కల్పించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త దిశ చూపిందని ఏపీ టూరిజం అసోసియేషన్ అధ్యక్షుడు, లఘు ఉద్యోగ్ భారతి జాయింట్ జనరల్ సెక్రటరీ, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో డాక్టర్ తరుణ్ కాకాని అన్నారు. పర్యాటక రంగాన్ని ఉపాధి సృష్టి, పెట్టుబడుల ఆకర్షణ, అంతర్జాతీయ ఆదాయ వనరుగా మార్చే దిశగా కేంద్ర బడ్జెట్ కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు.

భారతదేశంలో తొలిసారిగా సీప్లేన్‌ల తయారీకి కేంద్రం ప్రోత్సాహం ప్రకటించడం పర్యాటక రంగానికి విప్లవాత్మక మార్పుగా మారనుందని డాక్టర్ తరుణ్ కాకాని అభిప్రాయపడ్డారు. నదులు, సరస్సులు, సముద్ర తీరాలు ఉన్న ప్రాంతాల్లో సీప్లేన్ సేవలు ప్రారంభమైతే దేశీయ పర్యాటకంతో పాటు అంతర్జాతీయ పర్యాటకాన్ని కూడా విస్తృతంగా ప్రోత్సహించవచ్చని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి తీర రాష్ట్రాలకు ఇది అపార అవకాశాలు తెచ్చిపెడుతుందని అన్నారు.

పర్యాటక రంగంలో సేవల నాణ్యతను మెరుగుపర్చే లక్ష్యంతో జాతీయ ఆతిథ్య బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించడాన్ని ఆయన స్వాగతించారు. హోటళ్లు, రిసార్టులు, పర్యాటక సేవల రంగంలో ఒకే ప్రమాణాలను అమలు చేయడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో ఈ బోర్డు కీలక పాత్ర పోషించనుందని అన్నారు. పర్యాటక, ఆతిథ్య రంగాల్లోని 20 కీలక విభాగాల్లో 10,000 మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు కేంద్రం నిర్ణయించడం నిరుద్యోగ యువతకు పెద్ద ఊరటగా మారనుందని డాక్టర్ తరుణ్ కాకాని తెలిపారు.

దీని ద్వారా హోటల్ మేనేజ్‌మెంట్, ట్రావెల్ సేవలు, టూర్ గైడ్‌లు, బోటింగ్, ఎయిర్ టూరిజం వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, నాగార్జునకొండతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో 12 బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి కేంద్రం ప్రతిపాదనలు చేయడం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించినట్లేనని పేర్కొన్నారు. ఇది బౌద్ధ పర్యాటకాన్ని ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించి, రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల రాకను మరింత పెంచే అవకాశం ఉందన్నారు.

పర్యాటక అభివృద్ధి, ప్రచారం కోసం రూ.2,581 కోట్ల నిధులు కేటాయించడం కేంద్ర బడ్జెట్‌లో అత్యంత కీలక అంశమని డాక్టర్ తరుణ్ కాకాని తెలిపారు. ఈ నిధులతో మౌలిక వసతులు, పర్యాటక కేంద్రాల అభివృద్ధి, ప్రచార కార్యక్రమాలు, అంతర్జాతీయ ప్రమాణాల సేవలు ఏర్పాటు చేయవచ్చని అన్నారు. భారతదేశానికి అంతర్జాతీయ పర్యాటకాన్ని ఆకర్షించే దిశగా విదేశాల్లో పర్యాటక ప్రచార కార్యాలయాల స్థాపన కూడా కీలక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో భారత పర్యాటక అవకాశాలను ప్రచారం చేయడం ద్వారా విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగి, దేశానికి విదేశీ మారకద్రవ్య ఆదాయం భారీగా పెరుగుతుందని విశ్లేషించారు.

Leave a Reply