Gadde Anuradha | అంబటి రాంబాబు, జగన్ క్షమాపణ చెప్పాలి..

Gadde Anuradha | అంబటి రాంబాబు, జగన్ క్షమాపణ చెప్పాలి..

Gadde Anuradha, విజయవాడ, ఆంధ్రప్రభ : వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు గద్దె అనురాధ తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుత రాజకీయ నాయకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి.. వ్యక్తిగత దూషణలకు దిగడం, వైకాపా రాజకీయ సంస్కృతి ఎంత దిగజారిందో స్పష్టంగా చూపుతోందని ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమేనని, కానీ వ్యక్తిగత అవమానాలు, నీచ పదజాలం రాజకీయంగా అంగీకరించదగినవి కావని గద్దె అనురాధ స్పష్టం చేశారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు ముందు ఆయనే కాకుండా, వాటిని అడ్డుకోలేని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

వైకాపా ఎదుర్కొన్న ఘోర పరాజయానికి ప్రజలను నిందించడం పూర్తిగా హాస్యాస్పదమని, ఆ పార్టీ పతనానికి పూర్తి బాధ్యత వైకాపా నాయకులదేనని ఆమె స్పష్టం చేశారు. వైకాపా ఓటమి ప్రతిపక్షాల కుట్ర వల్ల కాదని, అది పూర్తిగా వారి అహంకారం, అదుపు లేని మాటలు, ప్రజా వ్యతిరేక విధానాల ఫలితమని వ్యాఖ్యానించారు. ప్రజలను, వ్యవస్థలను, రాజ్యాంగబద్ధ సంస్థలను, వ్యక్తులను దూషిస్తూ మాట్లాడటమే రాజకీయ బలం అన్న భ్రమ వైకాపా నేతల్లో బలంగా చోటు చేసుకుందని, అదే వారి రాజకీయ పతనానికి మూలకారణమైందన్నారు. వైకాపాకు శత్రువు బయట ఎక్కడో లేడని, అద్దంలో చూసుకుంటేనే వారి అసలు శత్రువు కనిపిస్తాడని ఘాటుగా వ్యాఖ్యానించారు.

వైకాపా ఓటమి ఎన్నికల రోజున ప్రారంభం కాలేదని, 5 సంవత్సరాల, వారి నాయకుల మాటల్లో, ప్రవర్తనలోనే మొదలైందని ఆమె అన్నారు. అహంకారం, అసహనం, దూషణలు, ప్రజా వ్యతిరేకత,పార్టీ పతనం ఇదే వైకాపా రాజకీయ ప్రయాణమని గద్దె అనురాధ వివరించారు. ప్రజలు వైకాపాను తిప్పికొట్టలేదని, వైకాపా నాయకుల ప్రవర్తనే ప్రజలను తిప్పికొట్టేలా చేసిందని ఆమె స్పష్టం చేశారు. వైకాపా రాజకీయంగా ఓడిపోకముందే నైతికంగా పూర్తిగా పతనమైందని, నాయకుల దూషణలే ఆ పార్టీ రాజకీయ అంత్యక్రియలకు కారణమయ్యాయని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటమి అనేది ఓటర్ల తీర్పు అయితే, వైకాపా ఓటమి మాత్రం వారి నాయకుల తప్పిదాలకు వచ్చిన శిక్షేనని గద్దె అనురాధ తేల్చి చెప్పారు.

Leave a Reply