medaram 2026 | జాతరతో పాటు చూడాల్సిన పరిసర పర్యాటక ప్రాంతాలు

medaram 2026 |మేడారం జాతర – భక్తి, ప్రకృతి, పర్యాటకానికి అరుదైన సమ్మేళనం
తాడ్వాయి అటవీ ప్రాంతం – ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం
తెలంగాణ నయాగరా బొగత జలపాతం – కళ్లారా చూడాల్సిన అద్భుతం
లక్నవరం సరస్సు – జలవిహారానికి అద్భుతమైన గమ్యం
రామప్ప ఆలయం – యునెస్కో వారసత్వ శిల్పకళా వైభవం
ఏటూరు నాగారం – గోదావరి అరణ్యాల నిశ్శబ్ధ సౌందర్యం
కన్నాయిగూడెం గోదావరి తీర ప్రాంతాలు – గిరిజన జీవన శైలికి అద్దం
మేడారం జాతర సందర్శకులకు ముఖ్య సూచనలు
medaram 2026 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆసియాలోనే అతి పెద్ద గిరిజన సంస్కృతికి ప్రతీకగా జరిగే జాతర మేడారం. సమ్మక్క–సారలమ్మ జాతరకు ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా వస్తారు భక్తజనం. తల్లులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నాక, జాతరతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలను కూడా చూడాలనుకుంటారు.అలా చూడాలనుకునే వారికి స్వాగతం పలుకుతుంటాయి అక్కడి అటవీ అందాలు, జలపాతాలు, సరస్సులు, దేవాలయాలు. మేడారం చుట్టుపక్కల ఏమేమున్నాయి? ఎలా వెళ్ళొచ్చు అనే విషయాలపై ఒక సమగ్ర విశ్లేషణ. ఇది మీకు మేడారం పర్యటనలో మార్గదర్శనంగా ఉపకరిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
medaram 2026 |అటవీ స్వర్గధామంగా పేరు పొందిన తాడ్వాయి

మేడారం నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. తాడ్వాయి ప్రాంతం ప్రత్యేకతలు చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి. దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలు ఎటుచూసినా ప్రకృతి అందాలతో అలరారే ఈ ప్రాంతం, ప్రకృతి ప్రేమికులకు, ట్రెక్కింగ్ సాహసికులకు అనువైన ప్రదేశం. కోయ, లాంబాడా గిరిజన సంస్కృతిని, వారి జీవన శైలిని ఇక్కడ చూడవచ్చు. తాడ్వాయికి రవాణా సౌకర్యాల విషయానికొస్తే, మేడారం నుంచి టీఎసార్టీసె బస్సులు (జాతర సమయంలో ప్రత్యేక బస్సులు) ఉంటాయి. ఇవే కాక జీప్‌లు, ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి.
medaram 2026 | తెలంగాణ నయాగరాగా చెప్పుకొనే బొగత జలపాతం

మేడారంకి 35–40 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ బొగత జలపాతం ప్రత్యేకతలెన్నెన్నో. బొగత జలపాతం విశేషాలివే. వెడల్పైన జలపాతం మనను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆ అద్భుత దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చాలవనేది సందర్శకుల అనుభవం. ఈ జలపాతం వర్షాకాలంలో మరింత అందంగా కనిపిస్తుంది. ఫోటోగ్రఫీ, వీకెండ్ ట్రిప్‌కు బొగత జలపాతం అనువైన ప్రదేశం. ఈ బొగత జలపాతానికి చేరుకోవాలంటే మేడారం నుండి తాడ్వాయి, అక్కడి నుండి బొగత జలపాతాలకు జీప్ లు లేదా ఆటోల్ చేరుకోవచ్చు.. ఇక్కడికి చేరుకోవడానికి మన స్వంత వాహనమైతే మరీ మంచిది.
medaram 2026 | ప్రకృతి అందాల జలదృశ్యం, లక్నవరం సరస్సు.

ఇది మేడారం కి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లక్నవరం సరస్సు ప్రత్యేకతలు చూసి తీరాల్సిందే. సరస్సుపై నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జ్, దీవులు భలే అనుభూతినిస్తాయి. లక్నవరం సరస్సులో బోటింగ్ సౌకర్యం ఉంటుంది. ఈ బోట్లలో కుటుంబంతో విహారం ఒక మర్చిపోలేని అనుభూతిగా మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. లక్నవరం చేరుకోవాలంటే, మేడారం నుండి ములుగు అక్కడి నుండి లక్నవరం చేరుకోవచ్చు. బస్సులు ఉంటాయి. ఇవే కాక ములుగు నుంచి ఆటోలు కూడా ఉంటాయి.
medaram 2026 |యునెస్కో వారసత్వ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయం

అద్భుతమైన శిల్పకళా వైభవం. ఇది మేడారానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రామప్ప క్షేత్ర ప్రత్యేకతలు ఎన్నెన్నో.. కాకతీయుల కాలం నాటి అద్భుత శిల్పకళ కళ్ళను కట్టి పడేస్తుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు మనకెంతో గర్వకారణంగా అనిపిస్తుంది. ఈ క్షేత్రంలోని రామప్ప సరస్సు కూడా చాలా అందంగా దర్శనీయం. మేడారం నుంచి ములుగు, అక్కడి నుంచి వెంకటాపూర్, రామప్ప చేరుకోవచ్చు. రామప్పకి టీఎసార్టీసె బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.
medaram 2026 | అందాల అటవీ ప్రాంతంగా ప్రసిద్ధి పొందిన ఏటూరు నాగారం

మేడారం నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఏటూరు నాగారం ప్రత్యేకతలు బోలెడన్ని. పచ్చటి ప్రకృతి అందాలతో అలరారే గోదావరి పరివాహక అరణ్యాలు చూడదగినవి. ఈ అడవుల్లో అరుదైన వృక్షాలు, పక్షులు, జంతువులు అనేకం. నిశ్శబ్ధమైన, ప్రశాంతమైన వాతావరణం అక్కడి నుంచి కదలనీయదు. ఏటూరు నాగారం చేరుకోవడానికి మేడారం నుంచి బస్సులు, జీప్‌లు అందుబాటులో ఉంటాయి.
ఇవే కాక మేడారం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో కన్నాయిగూడెం వైపు గోదావరి నది తీర ప్రాంతాలు అద్భుతమైన సుందర ప్రాంతాలు.
ఈ ప్రాంతం ప్రత్యేకతలు గోదావరి నది అందాలు, గిరిజన గ్రామాల జీవన ప్రత్యేకమైన శైలి మధురానుభూతులను కలిగిస్తాయి. మేడారం నుంచి ఇక్కడికి ఏటూరునాగారం ద్వారా కన్నాయిగూడెం చేరుకోవచ్చు. ఇవీ మేడారం పరిసర ప్రాంతాల్లోని దర్శనీయ స్థలాలు. వీటిలో ఏవి వీలైతే అవి చూసి రావడం మర్చిపోకండి. మేడారం జాతర సందర్శన సమయంలో కొన్ని ముఖ్యమైన సంగతులు మరవొద్దు.
జాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఉదయం తొందరగా ప్రయాణం ప్రారంభించాలి అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగాన్నినివారించాలి. ఎందుకంటే, ఎప్పటికీ అక్కడ శుభ్రం చేసేందుకు పారిశుధ్య సిబ్బంది ఉండరు. మనం పారేసే చెత్త, ప్లాస్టిక్ అక్కడే ఉండిపోతుంది.
అది పరిసరాలను అపరిశుభ్రంగా మార్చేస్తుంది. అవి ఎక్కువై, పర్యావరణానికి హాని కలిగిస్తాయని గుర్తుంచుకోవాలి. స్థానిక రవాణా వివరాలను ప్రయాణానికంటే ముందే తెలుసుకోవడం మంచిది మేడారం జాతర కేవలం భక్తి పరమైన అనుభూతి మాత్రమే కాదు, ప్రకృతి–సంస్కృతి–పర్యాటకాన్ని ఒకేచోట ఆస్వాదించే అరుదైన, అద్భుతమైన అవకాశం. మన బిజీ షెడ్యూల్ లో సమయం కేటాయించి ఈ జాతరను మాత్రమే కాక, ఈ పరిసర ప్రాంతాలను దర్శిస్తే మీ ప్రయాణం మరింత మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
ఈ దారులన్నీ సజావుగా సాగే హైవేలు కాదు, కొన్నిచోట్ల కచ్చారోడ్లు, మరికొన్ని చోట్ల ఎగుడు దిగుడు మట్టినేలల దార్లు, ఇరుకైన దారులు..ఇలా రకరకాలుగా ఉండొచ్చు…అందుకని ఎన్నుకునే రవాణా సురక్షితమైనదిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళను తీసుకుని వేళ్ళేప్పుడు స్థానికులను కాస్త జాగ్రత్తగా గమనించి ఆయా వాహనాలలో ఎక్కడం సురక్షితం. ఎందుకంటే నిర్జనమైన ప్రదేశాలగుండా మైళ్ళకొద్దీ ప్రయాణించవలసి ఉంటుంది.
భక్తి, ఆధ్యాత్మిక భావనలతో బాటు పరిసరాలపై అవగాహన, అప్రమత్తత అత్యవసరం. ఇవి లేకుంటే మధుర జ్ఞాపకంగా మిగిలి పోవాల్సిన యాత్ర కాస్తా చేదు జ్ఞాపకంగా గుర్తుండి పోవద్దు.
CLICK HERE TO READ VISIT | జంపన్న వాగులో భక్తుల పుణ్య స్నానాలు
