Ghantasala | దివ్యసీమగా మార్చిన ఘనత మండలిదే

Ghantasala | దివ్యసీమగా మార్చిన ఘనత మండలిదే

  • మహనీయులు మాజీ మంత్రి కృష్ణారావు
  • ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు

Ghantasala | ఘంటసాల, ఆంధ్రప్రభ : దివిసీమను దివ్యసీమగా మార్చిన మహనీయులు మండలి వెంకట కృష్ణారావు అని ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు. మాజీ మంత్రి, దివంగత మండలి వెంకట కృష్ణారావు శతజయంతి వేడుకలను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి దిరిశం బాలకోటయ్య ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక పెద్దగూడెంలో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ 1977లో వచ్చిన తుఫాన్కు దివిసీమ అతలాకుతలం అయిపోగా, దివిసీమకు నేనున్నానంటూ ముందుకు వచ్చి ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి కృష్ణారావు అన్నారు. దివిసీమ పునర్నిర్మాణంలో శక్తివంచన లేకుండా కృషి చేసిన వ్యక్తి కృష్ణారావు అన్నారు. స్వచ్చమైన రాజకీయాలు నడిపిన వ్యక్తి మండలి కృష్ణారావు అన్నారు. అన్ని వర్గాల మన్ననలు పొందిన వెంకట కృష్ణారావు శతజయంతి ఉత్సవాలు ఏడాది పాటు నియోజకవర్గంలో నిర్వహించటం ముదావహమన్నారు.

హరిజనవాడలో ఇంత వైభవంగా మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ఉత్సవాలు జరిపిన నిర్వాహకులు అభినందనీయులన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ తన తండ్రి మండలి వెంకటకృష్ణారావు గాంధేయ మార్గంలో నడిచారని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ దివిసీమ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నాయకులు దిరిశం బాలకోటయ్య పెద్దగూడెంలో మండలి వెంకట కృష్ణారావు శతజయంతి వేడుకలు నిర్వహించటం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు.

రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఉపసంచాలకులు డి.పెంచలయ్య మాట్లాడుతూ తెలుగుభాషకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న వ్యక్తి మండలి బుద్దప్రసాద్ అని, తెలుగుభాషను, తెలుగు జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జానపద కళాకారుల మాజీ చైర్మన్ పొట్లూరి హరికృష్ణారావు మాట్లాడుతూ మండలి వెంకట కృష్ణారావు కీర్తిశేషులు కాదని, స్పూర్తి శేషులని కొనియాడారు. రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ మండలి కుటుంబంతో తనకున్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. తొలుత మండలి వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ఉపసంచాకులు పెంచలయ్యను గజమాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ తోట కనకదుర్గ, ఘంటసాల, చల్లపల్లి సర్పంచులు బి.వెంకటేశ్వరమ్మ, పైడిపాముల కృష్ణకుమారి, జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, పలు కార్పొరేషన్ డైరెక్టర్లు బోలెం నాగమణి, పైడిపాముల స్వప్న, పీఏసీఎస్ అధ్యక్షులు బండి పరాత్పరరావు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, శ్రీకాకుళం ఎంపీటీసీ తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), టీడీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు దిరిశం వెంకట్రావు, దాసి సీతారామరాజు, పూర్ణచంద్రరావు, బుల్లా కిషోర్, కుంపటి శిరీష, ఎస్ఐ వేమన చందన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply