teacher | గణితం బోధన.. విద్యార్థులతో కలిసి భోజనం

teacher | గణితం బోధన.. విద్యార్థులతో కలిసి భోజనం

  • మున్సిపల్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా మారిన జిల్లా కలెక్టర్
  • గణితంలో మెళకువలు నేర్పటంతో విద్యార్థుల ఆనందం

teacher | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఉపాధ్యాయునిగా మారిపోయారు. బలగలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన, పదో తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ముఖ్యంగా రైజింగ్ స్టార్స్, స్కై స్టార్స్ గ్రూపులకు చెందిన విద్యార్థులతో సుమారు గంటకు పైగా మాట్లాడారు. గణితంలో మంచి ప్రావీణ్యం ఉన్న కలెక్టర్, కాసేపు ఉపాధ్యాయుడి అవతారమెత్తారు.

కఠినమైన లెక్కలను సైతం సులువుగా ఎలా పరిష్కరించాలో విద్యార్థులకు బ్లాక్ బోర్డుపై చేసి చూపించారు. గణితంలో ఉన్న కిటుకులను వివరిస్తుంటే విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు సందేహాలను ఆయన ఓపికగా నివృత్తి చేశారు.

భవిష్యత్తులో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? అని కలెక్టర్ విద్యార్థులను ప్రశ్నించగా, విద్యార్థుల నుంచి ఉత్సాహభరిత సమాధానాలు వచ్చాయి. ఈ సందర్భంగా ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ తో పాటు వృత్తి విద్యా కోర్సులపై ఆయన దిశానిర్దేశం చేశారు. మీరు కలెక్టర్ ఎలా అయ్యారు? అని ఓ విద్యార్థి అడగగా.. తన బాల్యం, ఐఐటీ గౌహతిలో చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. తొలుత ఐపీఎస్‌కు ఎంపికైనా, పట్టు వదలకుండా శ్రమించి ఐఏఎస్ సాధించానన్నారు. నాకు ఇష్టమైన గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులే నా విజయానికి తోడ్పడ్డాయని తెలిపి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు.

రుచికరమైన భోజనం..

మధ్యాహ్న సమయం కావడంతో కలెక్టర్ విద్యార్థులతో కలిసే కూర్చుని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి తిన్నారు. భోజనం రుచిగా ఉందా? మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా? అని విద్యార్థుల నుంచి ఆరా తీశారు ఆరా తీశారు. పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా, చదువుకోవడానికి అనువైన వాతావరణంతో ఉండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ పాఠశాల సిబ్బందిని అభినందించారు.

తన ప్లేటు తానే కడిగిన కలెక్టర్!

teacher |

మధ్యాహ్న భోజనం ముగిసిన తర్వాత కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. భోజనం చేసిన ప్లేటును అక్కడి సిబ్బందికి ఇవ్వకుండా, స్వయంగా తానే ట్యాప్ వద్దకు వెళ్లి శుభ్రం చేసుకున్నారు. మనం చేసే పనిలో ఏదీ తక్కువ కాదు.. క్రమశిక్షణ, సొంత పనులు చేసుకోవడం అనేవి విద్యార్థి దశ నుంచే అలవడాలి అని తన చేతల ద్వారా కలెక్టర్ చూపించారు. కలెక్టర్ నిరాడంబరతను చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందించారు.

Leave a Reply