518 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు పంపిణీ

518 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు పంపిణీ


ఇప్పటివరకు రూ.3.70 కోట్ల విలువైన 2200 ఫోన్లు స్వాధీనం


శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి అందించే కార్యక్రమంలో భాగంగా, పోలీసులు మరోసారి 518 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించారు.

జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, ఐటీ సెల్ అధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యల ద్వారా గత నాలుగు నెలల కాలంలో సుమారు రూ.కోటి విలువైన ఫోన్లు రికవరీ చేసి పంపిణీ చేశారు.

మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ ఫోన్లను బాధితులకు అందజేశారు.


జిల్లా ఎస్పీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు 2024 సంవత్సరంలో 622, 2025లో 1060, 2026లో 518 ఫోన్లు రికవరీ చేయగా, మొత్తం 2200 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.3.70 కోట్లు ఉంటుందని వివరించారు.

ఫిర్యాదుదారుల సమాచారాన్ని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విశ్లేషించి, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫోన్లను కూడా గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.


మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు, CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. సెయిర్.గోవ్.ఇన్ పోర్టల్ ద్వారా ఫోన్‌ను బ్లాక్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని, లేకపోతే అదే ఫోన్ సైబర్ నేరాలకు ఉపయోగపడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.


సైబర్ క్రైమ్, ఐటీ సెల్ బృందం సీఐ, ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫోన్లను కూడా గుర్తించి రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించారని ఎస్పీ అభినందించారు.

బాధితులు ఫోన్లు తిరిగి పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.



Leave a Reply